శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడిన దొంగను దోచిన గజదొంగల వ్యవహారం కోర్టుకు చేరనుంది. పరకామణి వ్యవహారంపై హైకోర్టు గతంలో సీరియస్ అయింది. విచారణ జరిపి డిసెంబర్ రెండో తేదీలోపు నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. సీఐడీ ఇప్పటికి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది. పూర్తి అయిందా లేక ఇంకా గడువు కోరుతారా లేదా అన్న విషయం పక్కన పెడితే.. నివేదికను మంగళవారం హైకోర్టుకు సమర్పించనుంది సీఐడీ. సీఐడీ ఏం తేల్చిందన్నదే ఇప్పుడు కీలకం.
పరకామణి చోరీ కేసు ఓ గూడుపుఠాణి
శ్రీవారి పరకామణి నుంచి డాలర్లను దొంగతనం చేస్తూ దొరికిన రవికుమార్ పై సతీష్ అనే విజిలెన్స్ అధికారి కేసు పెట్టారు. తర్వాత అతనితో టీటీడీ పెద్దలు రాజీ చేసుకున్నారు. అతని దగ్గర ఉన్న కొన్ని ఆస్తుల్ని టీటీడీ రాసిచ్చేలా చేసి రాజీ చేశారు. దీన్ని ఫిర్యాదు దారు అయిన సతీష్ తోనే పూర్తి చేశారు. ఆ సతీష్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కానీ అసలు ఎందుకిలా చేయాల్సి వచ్చిందో ఆయన రెండు, మూడు సార్లు విచారణకు హాజరైనప్పుడు చెప్పారు. రవికుమార్ కు ఉన్న వందల కోట్ల ఆస్తులు ఆ సమయంలోనే చేతులు మారినట్లుగా గుర్తించారు.
హండీలోనేనా ఇంకా ఏమైనా దొంగతనం చేశారా?
రవికుమార్ పరకామణిలో చోరీ చేస్తే వందల కోట్ల ఆస్తులు సంపాదించలేరు. కానీ ఆయన సంపాదించారు. వాటిని ఈ దొంగతనం బయటపడిన తర్వాత తమ పేరుపై మార్చుకున్నారు కొంత మంది. అసలు రవికుమార్ చేసిన దొంగతనాలు పరకామణిలోనేనా.. ఇంకా ఉన్నాయా.. ఎంత మేర ఇలా దొంగతనం చేశాడని సీఐడీ రిపోర్టులో తేలిపోయే అవకాశం ఉంది. అలాగే ఆ దొంగ వద్ద ఆస్తులు రాయించుకున్న గజదొంగలెవరో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఐడీ ఈ కేసులో అందర్నీ ప్రశ్నించింది. టీటీడీ చైర్మన్లుగా పని చేసిన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను కూడా ప్రశ్నించింది. తేలు కుట్టిన దొంగల్లా కొంత మంది వ్యవహరించిన తీరు కూడా హాట్ టాపిక్ అయింది.
సీఐడీ నివేదిక సమర్పణ తర్వాత అసలు సంచలనం
సీఐడీ ఈ కేసులో నివేదిక సమర్పించిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో రాజీ చేయడం అనేది చాలా పెద్ద స్థాయిలో జరిగిన వ్యవహారం. ఎవరు చేశారు..ఎందుకు చేశారన్నది తేలిపోనుంది. ఆ వివరాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత..దేవుడ్ని దోచుకున్న వారెవరు.. ఆ దొంగను దోచుకున్న గజదొంగలెవరు అన్నది ప్రజలకు స్పష్టత వస్తుంది.
