14 రీల్స్ సంస్థకు ఓ చరిత్ర ఉంది. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన ఘనత ఈ సంస్థది. మహేష్ తో ముచ్చటగా మూడు సినిమాలు తీశారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర ఈ త్రయం జోరుగా సినిమాలు తీసింది. అయితే ఆ తరవాత అనిల్ సుంకర పక్కకు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ.. 14 రీల్స్ ప్లస్ పేరుతో రామ్, గోపీ కొత్త ప్రయాణం మొదలెట్టారు. కథలకు పెద్ద పీట వేస్తూ, కమర్షియల్ హంగులు జోడిస్తూ సినిమాలు తీస్తుంటారు రామ్, గోపీ. అయితే కొంతకాలంగా అంతగా యాక్టీవ్ లో లేరు. ‘టైసన్ నాయుడు’ సినిమా కూడా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈలోపు చేసిన కొన్ని సినిమాలు సరైన ఫలితాలు తీసుకురాలేదు. అంతకు ముందు ‘వన్ నేనొక్కడినే’ వల్ల దాదాపు రూ.50 కోట్ల వరకూ నష్టపోయారని ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఇప్పుడు ఈ బ్యానర్ భారం ‘అఖండ 2’పై పడింది. నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబో అంటే ఎలాంటి హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖండ 2 సినిమా కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు. కానీ ఆ అవకాశం 14 రీల్స్ కి దక్కింది. ఈ సినిమాని ఈ ఇద్దరు నిర్మాతలూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ సినిమా తీశారు. మార్కెటింగ్ కూడా బాగానే చేసుకొన్నారు. ఇప్పుడు ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాతో ముందుగానే లాభాల బాటలో ప్రయాణించారు. కాకపోతే.. ఓ భారీ సక్సెస్ కొట్టి, 14 రీల్స్ ప్రతిష్టతి మరోసారి గుర్తు చేయాలన్నదే ఈ నిర్మాతల ధ్యేయం.
అఖండ 2కి వచ్చిన క్రేజ్, కాంబోపై ఉన్న హైప్ వల్ల ఓపెనింగ్స్ కి కొదవ ఉండదు. కాకపోతే.. టాక్ చాలా ముఖ్యం. కనీసం ‘బాగుంది’ అనే టాక్ వచ్చినా థియేటర్ల దగ్గర తిరునాళ్ల వాతావరణం కనిపించడం ఖాయం. టికెట్ రేట్లపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.. బుకింగ్స్ మొదలవ్వలేదు. ఒక్కసారి బుకింగ్స్ తెరిస్తే.. అఖండ 2 హైప్ ఎలా ఉందో అంచనా వేయొచ్చు. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అదే జరిగి, హిట్ టాక్ వస్తే.. 14 రీల్స్ మళ్లీ గాడిలో పడిపోయినట్టే. అఖండ 2 తరవాత వెంటనే టైసన్ నాయుడుపై దృష్టి పెడతారు నిర్మాతలు. ఇవి కాకుండా మరో రెండు సినిమాల్ని లైనప్ లో పెట్టబోతున్నారు. వాటికి సరైన బూస్టప్ దొరకడం ‘అఖండ 2’ రిజల్ట్ పై ఆధారపడి ఉంది.
