అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిని చేయాలని, పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం వేస్తున్న ప్రణాళికల్లో మరో అడుగు ముందుకు పడింది. కొన్ని ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలకు 16వేలకు పైగా ఎకరాలను ఏడు గ్రామాల పరిధిలో సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే మొదటి విడతలో రైతులు సహకరించినంతగా ఇప్పుడు సహకరిస్తారా అన్న సందేహం మాత్రం చాలా మందిలో ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం గతంలో అధికారులు సరిగా వ్యవహరించలేదని తాను మాట్లాడిన తర్వాత రైతులు అంగీకరించారని అంటున్నారు. రైతులు ఎంత మేర అంగీకరించారన్నది త్వరలోనే తేలిపోనుంది.
ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు కూలంగా గ్రామసభల తీర్మానం
ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ఏడు గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తయ్యాయి. ల్యాండ్ పూలింగ్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు పూర్తిగా గాడిన పడక ముందే రెండో విడత భూసమీకరణ మరో నలభై వేలఎకరాలు అని హడావుడి చేశారు. అసలు మొదటి దశలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయుకండా ఇదేం పద్దతని రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. దాంతో అప్పటికి భూసమీకరణను పక్కన పెట్టారు. అంత భారీ స్థాయిలో సమీకరించాల్సిన అవసరం లేదని.. కొన్ని మౌలిక సదుపాయాలకు సమీకరించాలని.. అన్ని పనులను బట్టి మిగతా సమీకరణపై ఆలోచించాలని నిర్ణయించారు.
మొదటి దశ అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తేనే కొత్తగా ఇవ్వాలనుకునేవారికి ధైర్యం
మొదటి దశలో రైతులు ఉత్సాహంగా భూములు ఇచ్చారు. భూసమీకరణ ప్రకటించిన నెలన్నరలో 90 శాతం మంది భూములు ఇచ్చారు. కొంత మంది భూములు ఇవ్వలేదు. వారు కూడా ఇటీవల ఇచ్చారు. అయినా కొన్ని భూములకు భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులు.. కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. వాటిని ఆరు నెలల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ రైతుల సమస్యను ఎంత వేగంగా పరిష్కరిస్తారన్న దానిపై ..రెండో విడతలో ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వాలనుకున్న రైతులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గతంలో ఉన్నంత భావోద్వేగం లేదు !
అమరావతి మన రాజధాని .. రాజధాని కోసం భూమి ఇస్తున్నాం మా భూముల్లో రాజధాని అనే భావన రైతుల్ని మొదటి విడతలో భూములు ఇవ్వడానికి ప్రేరేపించింది. కానీ ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అంత భావోద్వేగం లేదు. దానికి కారణం.. భూములిచ్చిన రైతులపై వైసీపీ చేసిన విష ప్రచారమే. సొంత రాజధానిపై కుట్రలు చేసే పార్టీ ఉండటమే. అయితే .. ఇప్పుడు రాజదాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు సమర్థతపై అందరికీ నమ్మకం ఉంది. ఈ ఒక్కటే.. రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడానికి డ్రైవింగ్ పాయింట్ లా పనికొస్తుంది. దాన్ని చంద్రబాబే నిలబెట్టుకోవాల్సి ఉంది.
