తిరుపతిలోని ఎంబీయూ యూనివర్శిటీ వద్ద ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ లీడర్లను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. పోలీసులు వారిని వెంటాడి.. మోహన్ బాబు ఫామ్ హౌస్ లో గుర్తించి రిలీజ్ చేయించారు. మోహన్ బాబు బౌన్సర్లను అరెస్టు చేశారు. విద్యార్థుల నుండి వసూలు చేసిన అదనపు ఫీజులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాలు చేస్తున్నారు. అయితే ఇది మోహన్ బాబుకు నచ్చినట్లుగా లేదు. తన బౌన్సర్లను పంపి వారిని కిడ్నాప్ చేయించారు.
ఎస్ఎఫ్ఐ నేతలను బౌన్సర్లు వాహనంలో తీసుకెళ్తున్న అంశంపై ఎస్ఎఫ్ఐ నేతలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కిడ్నాపర్లను వెంటాడారు. చివరకు మోహన్ బాబుకు చెందిన ఫామ్ హౌస్లో బందీలుగా ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు గుర్తించి సురక్షితంగా విడిపించారు. ఈ ఘటనకు బాధ్యులైన మోహన్ బాబు బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థి సంఘాల నాయకులపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
యూనివర్శిటీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసిందని ఇటీవల ఉన్నత విద్యామండలి గుర్తించింది. ఆ అదనపు ఫీజులను వెంటనే విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థి సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఈ క్రమంలోనే నేటి కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకోవడంతో మోహన్ బాబు తీరుపై మరోసారి విమర్శలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
