తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు , నేతలు ఒక్క సారిగా ఏదో గుర్తొచ్చినట్లుగా పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతూండటం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో వైపు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అతి పెద్ద సమ్మిట్ నిర్వహించి.. పెట్టుబడుల సునామీ సృష్టిస్తామని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అవసరం లేని రాజకీయాలు చేస్తూ.. పాజిటివ్ అంశాల నుంచి డైవర్ట్ అయిపోతున్నారు. అధికారంలో ఉన్న వారు అనుకూడని మాటలు మాట్లాడి వివాదాస్పదమవుతున్నారు.
అధికారం ఉంటే సినిమాల్ని ఆపేయగలరా?
సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. సినిమా ఒక్క ధియేటర్లో కూడా ఆడనివ్వనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలెంజ్ చేశారు. కానీ ఆయనకు తెలియనిది ఏమిటంటే.. ఆయన ఓ శాఖకు మంత్రిగా ఉన్నారంటే.. దానికి తాను మహారాజు అని కాదు అర్థం. తన శాఖ కిందకు వచ్చే అంశాల్లో చీమ చిటుక్కుమన్నా తన అనుమతి ఉండాలని అనుకోవడం కంటే అమాయకత్వం ఉండదు. ఏకపక్షంగా ఓ సినిమాను ఆపేయడానికి ఆయనకు అధికారం ఉండదు. అలాంటి శపధాలు చేస్తే ఆయనే చులకన అయిపోతారు. అదే జరుగుతుంది. స్వయంగా బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. రెచ్చగొట్టడానికి డైలాగులు చెప్పవద్దని…సినిమా ఎలా ఆపుతారని ప్రశ్నించారు.
డైవర్షన్ టాపిక్స్ చాలా ఉన్నాయి !
ప్రస్తుతం ఉన్న రాజకీయాల నుంచి డైవర్ట్ చేయానుకుంటే .. పవన్ కల్యాణ్ టాపిక్ కంటే ఇతర విషయాలు తీసుకుంటే బెటర్. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది?. పంచాయతీ ఎన్నికల్లో విస్తృతమైన ఎజెండా ఎప్పటికీ ఉండదు. గ్రామ సమస్యలు, గ్రామాల ఆధిపత్యమే అసలు ఎజెండా అవుతుంది. ఇప్పుడు సందర్భం లేకపోయినా.. పవన్ కల్యాణ్ మాటల్ని వివాదాస్పదం చేస్తే.. వచ్చే ఓట్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీకే అది మేలు చేస్తుంది.
పవన్ ఇమేజ్ ను తగ్గించలేరు !
పవన్ కల్యాణ్ మాటల ద్వారా ఆయన ఇమేజ్ ను తగ్గించాలనే ప్రయత్నం చేయాలనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు. ఎందుకంటే పవన్ ప్రసంగం స్టైల్ అలాగే ఉంటుంది. పవన్ కల్యాణ్ గురించి ఆయన అభిమానులకు తెలుసు. ఆయన మాటల్లోని అర్థాన్ని వారు అర్థం చేసుకుంటారు. ఇతరుల్ని అ మాటల ద్వారా రెచ్చగొట్టడం అంత తేలికగా విజయవంతమయ్యే ప్లాన్కూడా కాదు. అందుకే కాంగ్రెస్ నేతలు పవన్ కల్యాణ్ ను ఏపీలో ఇబ్బంది పెడదామని అంతర్గత ప్రయత్నాలు చేస్తే మాత్రం ఫెయిలవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలకమైన దశలో ఉంది. పాజిటివ్ ప్రచారం చేసుకుని.. ప్రజల్లో అభిమానం పొందే ప్రయత్నం చేస్తే ఎంతో మేలు!
