విజువల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకొని చాలా సినిమాలు తయారవుతున్నాయి. ప్రేక్షకుల్ని కొత్త అనుభూతికి గురిచేయడం సినిమా ధ్యేయంగా మారాక… వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ క్రమంలో వీఎఫ్ఎక్స్కి ప్రాధాన్యత ఇస్తూ మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో హీరో.. సాయిధరమ్ తేజ్.
‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ తో అందర్నీ ఆకట్టుకొన్న దర్శకుడు తేజా కాకమాను. ఆ తరవాత కొన్ని సినిమాల్లో నటుడిగానూ మెప్పించారు. ఇప్పుడు ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. అటవీ నేపథ్యంలో ఆయన ఓ కథ రాసుకొన్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కి కథ వినిపించారు. ఆయనకూ బాగా నచ్చింది. 2026 ప్రధమార్థంలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఈ కథలో పులి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. పులితో హీరో పోరాటాన్ని వేరే స్థాయిలో డిజైన్ చేశాడట దర్శకుడు. ఆ ఎపిసోడ్లు ఆడిటోరియాన్ని థ్రిల్ కి గురి చేస్తాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం సాయిధరమ్ ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే తేజా కాకమాను సినిమా మొదలయ్యే ఛాన్సుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జోరుగా సాగుతున్నాయి.