పెదకాపు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విరాట్కర్ణ. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, విరాట్కర్ణకి స్వయంగా బావ. తనని హీరోగా నిలబెట్టాలని పెద్ద కాన్వాస్ లో సినిమా తీశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. విరాట్ పై ఫ్లాఫ్ ముద్రపడింది. కాకపోతే ఇప్పుడు విరాట్ చేస్తున్న ‘నాగబంధం’ సినిమా అంతకుమించి అన్నట్టుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అభిషేక్ నామా.
కేవలం క్లైమాక్స్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సినీ వర్గాలు చెప్పడం సోషల్ మీడియా చర్చనీయంశమైయింది. పబ్లిసిటీ గిమ్మిక్ అని కొందరు, ఫ్లాఫ్ హీరోపై అన్ని కోట్లు పెట్టడం అవసరమా? అని ఇంకొందరు, అసలు మార్కెట్ ఎంతో తెలియని హీరోపై అన్ని కోట్లు ఖర్చు చేయడం జూదం అవుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అభిషేక్ నామా స్వయంగా నిర్మాత. ఆయనకి ఈ లెక్కలు తెలియనివి కాదు. ఈ సినిమా విషయంలో ఆయన కాన్ఫిడెంట్ గా వున్నారు. డెవిల్ సినిమాకి సమస్య వస్తే మధ్యలో ఆయన డైరెక్షన్ చైర్ ని టేకాఫ్ చేసుకున్నారు. ఎప్పటినుంచో ఆయనకి డైరెక్షన్ చేయాలని వుంది. పైగా ఆయనది ఫైన్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ కి తగ్గట్టు, హీరో ఇమేజ్ కంటే కంటెంట్ కి ప్రాధాన్యత ఇస్తూ ఈ సబ్జెక్ట్ ని రాసుకున్నారు.
భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాలు, అక్కడి నేలమాళిగలు, రహస్యాల చుట్టూ సాగే కథతో రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ రెడీ చేస్తున్నారు. హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ నమ్మి చేస్తున్న సినిమా అనే అవగాహన నిర్మాతల్లో మొదటి నుంచి వుంది. సినిమా ప్రమోషన్స్ ని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.