ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు అంతా పేదలే అయిఉంటారు. ఇప్పుడు ఏ మాత్రం స్థోమత ఉన్నా ప్రైవేటుగా చదివించేస్తున్నారు . నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్లలో లభిస్తుందని ప్రజలు నమ్మడం మానేశారు. కానీ ఫీజులు కట్టలేక నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తోందని..దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తోందని నమ్మకం కలిగించేందుకు నారా లోకేష్ ఎన్నో చర్యలు చేపట్టారు. వాటిని వివరించేందుకు మెగా పీటీఎంలు నిర్వహిస్తున్నారు.
45 వేల స్కూళ్లలో మెగా పీటీఎం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, సహాయక పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ -3.0 నిర్వహణకు పాఠశాల విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 45,000 పాఠశాలల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు పార్వతీపురం మన్యం జిల్లాలో పాల్గొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిలకలూరిపేటలో పాల్గొంటారు. అన్ని పాఠశాలల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
విద్యావ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా చూడనున్న తల్లిదండ్రులు
ఈ మెగా పీటీఎం కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి తమ బిడ్డ చదువుల పురోగతిని టీచర్ల వద్ద నుంచి తెలుసుకోవచ్చు. సమస్యల గురించి ప్రస్తావించవచ్చు. పాఠశాల విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని స్థాయిల వద్ద ఏర్పాట్లు చేసింది. నిజానికి ఈ పీటీఎం కాన్సెట్ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఉంటుంది. నారా లోకేష్ ప్రభుత్వం స్కూళ్లలోనూ ప్రవేశ పెట్టారు. పిల్లలు గొప్పగా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. ప్రభుత్వ బడిలో చేర్చినా .. వారి ఆశలకు రెక్కలు ఉంటాయని.. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. స్కూళ్లకు పిలిచి మరీ ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నారు.
రెండేళ్లలో విద్యావ్యవస్థలో అనూహ్యమైనా మార్పులు
విద్యాశాఖలో మెరుగుదల అంటే స్కూళ్లకు రంగులేయడం.. కాదు. విద్యా ప్రమాణాలు పెంచాలి. ఆ విషయంలో లోకేష్ ప్రణాళికాబద్ధంగా పని చేసుకుంటూ వస్తున్నారు. ముందుగా డీఎస్సీ నిర్వహించి టీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. కార్పొరేట్ స్థాయి విద్యకు తగ్గట్లుగా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. టీచింగ్ పట్ల ప్యాషన్ తో ఉండే ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం జరిగిన విద్యాశాఖను పూర్తి స్థాయిలో దారిలో పెట్టాలంటే.. రాత్రికి రాత్రి సాధ్యంకాదు. కానీ నారా లోకేష్ చాలా వేగంగా సంస్కరిస్తున్నారు. రాబోయే రోజుల్లో.. అత్యుత్తమ విద్యకు ప్రభుత్వ స్కూల్సే బెటర్ అనుకునేలా పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
