దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి డైలమాలో పడటంతో ఆయన స్వరం మారుతోంది. ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన రాజీనామా అంశంపై స్పందించారు. అది తనకు అలవాటైన విషయం అన్నట్లుగా మాట్లాడారు. రాజీనామాలు చేయడం, గెలవడం అలవాటేనని.. ఇప్పటి వరకూ పదకొండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తు చేశారు.
తన నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు సీఎంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ తన రాజీనామా అంశంపై చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున కోర్టు నిర్ణయం ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. దానం నాగేందర్ స్పీకర్ లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడంతో .. పార్టీ మారలేదని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఆయన రాజీనామా తప్పదన్న సూచనలు వస్తున్నాయి.
ఉపఎన్నికలు వచ్చినా ఆయన పోటీ చేయరని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అలాంటి పరిస్థితే వస్తే తానే పోటీ చేస్తానని దానం చెప్పకనే చెప్పారు. ఆ మధ్య హైడ్రాపై కోపం, పనులు కావడం లేదన్న ఆగ్రహంతో.. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను పొగిడారు.కానీ ఇప్పుడు .. పూర్తిగా కాంగ్రెస్ ట్రాక్ లోకే వచ్చారు.