రాజకీయం ఎంత మందిని అయినా బలి తీసుకుని తాము గెలవాలనుకుంటుంది. మీరు చచ్చిపోవద్దు..మేమే చచ్చిపోతామని నేతలు డైలాగులు చెబుతారు. అలాంటి మాటలతో మరింతగా ఉద్రేకపడే వారు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు మరోసారి తెలంగాణ యువతపై ఆత్మహత్య ట్రాప్ విసురుతోంది రాజకీయం. బీసీ యువతను టార్గెట్ చేస్తోంది. ఇలాంటి వారి ట్రాప్లో పడితే భవిష్యత్ అంధకారం అవుతుంది.
బీసీ రిజర్వేషన్ల కోసం యువకుడి ఆత్మహత్య – క్యూ కట్టిన రాజకీయ నేతలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం ప్రారంభమయింది. ఆత్మహత్య చేసుకుంటే రిజర్వేషన్లు వస్తాయని సాయి ఈశ్వర్ కు ఎవరు చెబుతారు?. కానీ ఆయన కోసం రాజకీయ నేతలు వాలిపోవడం ప్రారంభించారు. సాయి ఈశ్వర్ భౌతిక ఖాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. కేటీఆర్ ట్విట్టర్ లో ఖండించారు. ఇతర పార్టీల వారు వస్తారు. అందరూ ఒకటే చెబుతారు. మీరెవరూ చనిపోవద్దు..దాని కోసం మేమున్నామని చెబుతారు. కానీ వారి మాటలు ఎలా ఉంటాయో.. అవి యువతలోకి ఎలా వెళ్తాయో చెప్పాల్సిన పని లేదు.
తెలంగాణ ఉద్యమం సమయంలో వందల మంది బలిదానాలు
తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో అత్యధికులు బడుగులు, బలహీనవర్గాలవారే. ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ ఉద్యమం బలపడుతుందన్న సంకేతాలను ఇచ్చిన వారు ఎవరో అందరికీ తెలుసు. ఇప్పుడు వారంతా పదవులు అనుభవించారు.. అనుభవిస్తున్నారు. కానీ ఆ కుటుంబాలు మాత్రం తమ బిడ్డల్ని పోగొట్టుకున్న కుటుంబాలు మాత్రం కుమిలిపోతున్నాయి. చివరికి తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన వారికి న్యాయం జరగలేదని కవిత కూడా చెప్పారు. ఆమెకు కష్టం వచ్చి బయటకు వచ్చిన తరవాతనే చెప్పారు కానీ.. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తుకు రాలేదు. రాజకీయం అంటే అలాగే ఉంటుంది.
ఇప్పుడు బీసీ యువతపై అదే ట్రాప్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది పొలిటికల్ అస్త్రం. దాంతో బీసీల ఓట్లు పొందడానికి రాజకీయ పార్టీలు ఎవరికి మించిన డ్రామాలు వారు వేస్తారు. అవి సాధ్యమవుతాయా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు. ఒక వేళ ఆ రిజర్వేషన్లు వచ్చినా బీసీలంతా బాగుపడిపోతారని ఎవరూ అనుకోలేరు. 70 ఏళ్లుగా రిజర్వేషన్లు ఉన్న వర్గాలేమీ బాగుపడలేదు. కొంత మంది బాగుపడ్డారు. అయినా ప్రాణాలు వదిలేస్తే.. రిజర్వేషన్లు వస్తాయని అనుకోడం.. ఆ దిశగా యువతను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకోవడం అత్యంత ఘోరమైన రాజకీయం.
రాజకీయ నేతలు కాస్త ఆలోచించండి !
ఇలా అర్థం పర్థం లేని కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని పరామర్శించి ఇంకా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల మరికొంత మంది ఆవేశపడి ప్రాణాలు వదిలితే ఆ పాపం ఊరకనే పోదు. కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికీ వేదన పడుతున్నాయి. ఇప్పుడు మరోసారి బీసీ యువతను ఈ ట్రాప్ లోకి లాగాలని ప్రయత్నించడం బీసీ బిడ్డలపై కుట్ర చేయడమే. అలాంటి పనులు చేయడం కన్నా రాజకీయాలను వదిలేయడం శ్రేయస్కరం.
