వైసీపీకి.. జగన్కు.. కోటి అనే మాటకు చాలా అవినావభావ సంబంధం ఉంది. ఏదైనా భారీ విపత్తు సంభవిస్తే జగన్ రెడ్డి కోటి విరాళం ప్రకటిస్తారు. హుదూద్ వచ్చినప్పుడు.. కేరళలో వరదలు వచ్చినప్పుడు.. విజయవాడను బుడమేరు ముంచేసినప్పుడు కోటి విరాళం ప్రకటించారు. తాజాగా కోటి సంతకాల ఉద్యమం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోటి సంతకాలు చేపట్టారట. ఈ కోటి సంతకాల పుస్తకాలను తీసుకెళ్లి జగన్ గవర్నర్ కు ఇస్తారట. నిజంగా కోటి సంతకాలు ఎవరు పెట్టించారు..? ఎవరితో పెట్టించారంటే.. జగన్ ప్రకటించిన కోటి రూపాయలను ఎలా ఖర్చు పెట్టారో..అలాగే సేకరించారన్నమాట.
కోటి సంతకాలంటే మామలు విషయం కాదు. ఏపీలో ఐదుకోట్ల మంది జనం ఉంటే.. ప్రతి ఐదుగురిలో ఒకరి చేత సంతకాలు పెట్టించినట్లు. కానీ వైసీపీ నేతలు ఎక్కడ సంతకాల శిబిరం పెట్టినా పట్టించుకున్న వాళ్లు కనిపించలేదు. ఎప్పుడూ వెలవెలబోయేవి. వైసీపీ నేతలు నడిపే కాలేజీలకు వెళ్లి కొన్ని సంతకాలు పెట్టించుకున్నారు. హైదరాబాద్ లో కూకట్ పల్లి బస్టాండ్.. కొన్ని చోట్ల.. యాంకర్ శ్యామల వంటి వారిని పిలిచి సంతకాల కార్యక్రమం చేశారు. అక్కడెవరైనా సంతకాలు చేశారో లేదో కానీ.. ఏపీలో ఇష్యూకు హైదరాబాద్ లో కూడా సంతకాలు తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో వారికో తెలియాలి.
జగన్ రెడ్డి కోటి సంతకాలు పెట్టించాలని పార్టీ నేతలను ఆదేశించారు. సజ్జల రామకృష్ణారెడ్డి నియోజవర్గాల వారీగా టార్గెట్ ఇచ్చారు. కానీ కనీసం 150 నియోజకవర్గాల్లో జగన్ రెడ్డి ఆదేశాలను పట్టించుకునే నాయకత్వం లేదు. ఎవరూ సంతకాలు పెట్టించలేదు. కొంత మంది ఫోటోలకు పరిమితమయ్యారు. ఎక్కువ మంది ఫేక్ సంతకాలు ఇష్టం వచ్చినట్లుగా పెట్టేశారు. మనుషుల్ని పెట్టుకుని ఆ సంతకాలు పూర్తి చేశారు. ఆ సంతకాలు ఎవరివి.. వారి ఫోన్ నెంబర్లేమిటి అన్న వివరాలు ఉండవు. పైగా కోటి ఉంటాయా అన్నది కూడా లెక్కలేయలేరు. కొన్ని పుస్తకాలు తీసుకెళ్లి కోటి అని చెప్పుకోవడమే.
మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. నాలుగు కాలేజీలకు అనుమతులు మాత్రమే తెచ్చారు. మిగతా కాలేజీలను వేగంగా నిర్మించాల్సి వస్తే టెండర్లు ఇచ్చి.. పనులు చేయించారు. కానీ బిల్లులు ఇవ్వకపోవడంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. వాటిని పూర్తి చేసి నడిపించాలంటే వేల కోట్లు కావాలి. పీపీపీ మోడల్ లో అయితే.. త్వరగా అయిపోతాయని ప్రభుత్వం ఆ విధానానికి మొగ్గు చూపితే.. ఆయన సంపాదించిన ఆస్తులేవో అమ్మేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. చలో మెడికల్ కాలేజీ అని నర్సీపట్నం వెళ్లి మొండిగోడల్ని అందరికీ చూపించి పరువు పోగొట్టుకున్నారు. ఈ కోటి సంతకాలతోనూ ఆయనకు అదే పరిస్థితి ఎదురవుతుంది.
