హీరోల కొడుకులు, దర్శకుల వారసులు, నిర్మాతల తనయులు హీరోలు అవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ యాంకర్ ఇంటి నుంచి కూడా ఓ హీరో రాగలడు అని ‘బబుల్ గమ్’ సినిమాతో నిరూపించాడు రోషన్ కనకాల. ఆ సినిమాకు సుమ పెట్టుబడి పెట్టారు. కమర్షియల్ గా సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఎంట్రీ తో పాస్ మార్కులు తెచ్చుకొన్నాడు రోషన్ కనకాల. ఇప్పుడు తన రెండో సినిమా `మోగ్లీ` వస్తోంది. ఈ సినిమా నుంచి.. పాస్, యావరేజ్ మార్కులు ఆశించడం లేదు. కొడితే.. సిక్సరే అనే పొజీషన్. ఎందుకంటే యంగ్ హీరోల్లో టఫ్ కాంపిటీషన్ వుంది. బిలో యావరేజ్ సినిమాలు ఇచ్చి, టైమ్ పాస్ చేసే రోజులు పోయాయి. ‘బబుల్ గమ్’ రిజల్ట్ పక్కన పెట్టి, ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాల్సిందే. ఇది తనకు రెండో చివరి అవకాశం అనుకోవాలి.
తొలి సినిమా ‘బబుల్ గమ్’ కి సుమ తన పరిచయాలన్నీ వాడేశారు. ఆ సినిమాకు భారీ ఎత్తున ప్రమోషన్ చేశారు. సినిమా జనంలోకి వెళ్లడానికి అది కావల్సినంత ఉపయోగపడింది. ఈ సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి సంస్థ అండదండలున్నాయి. కాబట్టి ప్రమోషన్ పరంగా ఎలాంటి లోటూ ఉండకపోవొచ్చు. సుమ మరోసారి తన పరిచయాలు వాడి…. పబ్లిసిటీ చేసుకోవొచ్చు. ఈ విషయంలో రోషన్‌కు వంక పెట్టడానికి ఏం లేదు. తన ప్రతిభ పూర్తి స్థాయిలో నిరూపించుకోవాల్సిందే. లేదంటే పోటీలో నిలబడడం కష్టం.
‘మోగ్లీ’ సినిమాకు సంబంధించి రోషన్ దగ్గర మరో పెద్ద టాస్క్ వుంది. ఈ సినిమాలో బండి సరోజ్ విలన్ గా నటించాడు. తను సమర్థుడైన నటుడు. ఇండిపెండెంట్ సినిమాలతో తానేంటో నిరూపించుకొన్నాడు. టీజర్, ట్రైలర్లలో.. తన హవా ఎక్కువగా కనిపిస్తోంది. బండి సరోజ్ తో.. పోటీ పడి, తన మార్క్ చూపించుకోవడం కూడా రోషన్ కు ఛాలెంజే అనుకోవాలి. ఈనెల 12న ఈ సినిమా వస్తోంది. డిసెంబరులో రిలీజ్ అంటేనే నిర్మాతలకు దడ. ఎందుకంటే డిసెంబరు సీజన్ పరంగా చాలా డల్. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రోషన్ కనకాల ఎలాంటి మ్యాజిక్ చేస్తాడన్నది ఆసక్తికరం.


