టాలీవుడ్ పరిస్థితి మేడిపండులా తయారైంది. పైకి అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ…లోలోపల మొత్తం డొల్లే. ఏ నిర్మాతని కదిపినా.. పుట్టెడు కష్టాలు ఏకరువు పెడుతున్నాడు. కేసు ఓడినవాడు.. కోర్టులోపల ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంట్లో ఏడుస్తాడని అంటుంటారు. నిర్మాతలూ అంతే. ఫ్లాప్ తీసిన నిర్మాత కన్నీళ్లు బయటకు కనిపిస్తాయి. హిట్ కొట్టిన నిర్మాత కష్టాలు కనిపించవు.. అంతే తేడా.
పాతిక సినిమాలు తీస్తే.. అందులో ఒకటో రెండో హిట్టవుతాయి. మిగిలిన నిర్మాతలు అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్ముకొని మానేజ్ చేస్తుంటారు. పోనీ ఆ రెండు హిట్లు తీసిన నిర్మాతలైనా హ్యాపీనా…. అంటే అదీ లేదు. కొన్ని హిట్లు పోస్టర్లకు, ప్రకటనలకే పరిమితం. హిట్ టాక్ వచ్చి బ్రేక్ ఈవెన్ అవ్వని సినిమాలెన్నో కళ్ల ముందు కనిపిస్తాయి. అప్పుడప్పుడూ పుష్ప, ఆర్.ఆర్.ఆర్ లాంటి పెద్ద పెద్ద హిట్లు చూసి… ఇండస్ట్రీ అంతా బాగుపడిపోయిందనుకోవడం, లిటిల్ హార్ట్స్, కోర్ట్ లాంటి చిన్న సినిమాల విజయాలు చూసి.. పరిశ్రమ పచ్చగా ఉంది అనుకోవడం ముమ్మాటికీ అపోహ మాత్రమే. పైకి కనిపించే ఓ విజయం మాటున.. వంద ఎదురు దెబ్బలు, వెయ్యి పరాజయాలు దాక్కుంటాయి. వాటి గురించి ప్రచారం ఉండదు. అంతే.
సినిమాలో పెట్టుబడి పెట్టడం అనేది పేకాట కంటే ప్రమాదకరమైన జూదం అని జనాలు ఎప్పుడో గ్రహించేశారు. అయినా ఇన్ని కొత్త సినిమాలు, ఇన్ని పెట్టుబడులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి? ఏ ధైర్యంతో సినిమాలు తీస్తున్నారు..? అంటే.. అదే ‘జూదం’ తాలుకూ మ్యాజిక్కు. ‘లాటరీలో ఎవరికో కోటి రూపాయలు వచ్చాయి’ అంటే మన అదృష్టం కూడా పరీక్షించుకొందాం అనుకొనే వాళ్లే కోకొల్లలు. కానీ ఆ కోటి రూపాయల లాటరీ.. ఎన్ని చెల్లుబాటు కాని లాటరీలు ఉన్నాయో ఎవరికీ తెలీదు. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా ఆడితే.. `మూడు కోట్లు పెట్టి మనం కూడా సినిమా తీసి.. ముఫ్ఫై కోట్లు కొట్టొచ్చు` అని నిర్మాతలైపోయిన వాళ్లు ఎక్కువ. కానీ ఆ మూడు కోట్లు.. 30 కోట్లు అయ్యేలోపు కనీసం 300 మంది నిర్మాతలు తమ మూడు కోట్లు నష్టపోతుంటారు. ఈ నిజం మాత్రం ఎవ్వరూ తెలుసుకోలేరు.
చిన్న సినిమాతలే ఇలా ఉన్నారు, పెద్ద నిర్మాతలంతా సేఫ్ అనుకొంటారంతా. అది మరో అందమైన అబద్ధం. యేడాదికి నాలుగైదు సినిమాలు తీసి, వందల కోట్లని రొటేషన్ చేసే నిర్మాతల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. సంస్థ పలుకుబడి కోసం, తమని నమ్ముకొన్న బయ్యర్ల కోసం, లేదంటే ఇది వరకే ఇచ్చేసిన అడ్వాన్సుల కోసం, ఈ సినిమా కాకపోతే, మరోటి అనుకొంటూ మొండి ధైర్యంతో సినిమాలు తీస్తున్నారు తప్ప.. పెద్ద సంస్థల్లో ఒక్కరు కూడా హ్యాపీగా లేరన్నది వాస్తవం. పెద్ద సంస్థలకు ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఆ సంస్థ వెనుక కొంతమంది డబ్బున్న వాళ్ల హస్తం ఉంటుంది. రాజకీయ నాయకులో, రియల్ ఎస్టేట్ వ్యాపారులో.. తెర వెనుక నుంచి కొంత పెట్టుబడి పెడుతుంటారు. ఆ డబ్బుని ఈ నిర్మాతలు రొటేషన్ చేస్తుంటారు. లాభాలొస్తే.. సంస్థకు అందులో వాటా అందుతుంది. సంస్థ పరపతి పెరుగుతుంది. ఇలానే డబ్బుని రొటేషన్ చేసిన సంస్థలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇలా పెట్టుబడి పెట్టేవాళ్లు కూడా మెల్లమెల్లగా సైడ్ అయిపోతున్నారు.
ఇలాంటి పెట్టుబడి దారులు సినిమాల్లో ఉండే గ్లామర్ వైపు ఆకర్షితులై వస్తుంటారు. వాళ్లు సీరియస్ ఇన్వెస్టర్లు కారు. సినిమా నిర్మాణంలో ఉన్న మతలబులు కూడా వాళ్లకు తెలియకపోవొచ్చు. ఒకట్రెండు సినిమాలు సరిగా ఆడకపోయినా తట్టుకోగలరు. కానీ వరుస పరాజయాలు వస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారు? క్రమంగా సైడ్ అయిపోవడం తప్ప. ఇప్పుడు ఇలానే కొంతమంది పెట్టుబడి దారులు తమ భాగస్వామ్యాల నుంచి శాశ్వత సెలవు తీసుకొంటున్నారు. ఇది బడా నిర్మాణ సంస్థలకు పెద్ద ఎదురు దెబ్బ.
ఓటీటీ మార్కెట్ గాల్లో దీపంలా తయారైంది. శాటిలైట్ అయితే ఎప్పుడో ఆరిపోయింది. హీరోల ఇమేజ్లు చూసి జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితులు మారిపోయాయి. కంటెంట్ ఈజ్ ద కింగ్ అని తెలిసినా, కేవలం కమర్షియల్ అంశాలతో సినిమాల్ని నడిపించే దర్శకుల్ని, ఆ పని తీరుని నమ్మి పెట్టుబడి పెట్టడానికి ఎవరికి మాత్రం ధైర్యం ఉంటుంది? అందుకే కొన్ని నిర్మాణ సంస్థలు ప్రస్తుతం డోయాలమాన పరిస్థితుల్లో పడిపోయాయి. పెట్టుబడి పెట్టే వారు లేక.. తమ ప్రణాళికల్లో వచ్చిన అనూహ్యమైన మార్పులు తట్టుకోలేక చతికిల పడడానికి సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమ అనే పేక మేడ కూలడానికి సిద్ధంగా ఉంది అంటూ.. సినీ పండితులు, మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకపోతే ఇలాంటి పరిస్థితి ఇది వరకు చాలాసార్లు చూసింది సినీ పరిశ్రమ. పడిపోతుందేమో అనుకొంటున్నప్పుడు మళ్లీ లేచి నిలబడి పోరాడింది. అలాంటి పోరాటమే ఇప్పుడు చాలా చాలా అవసరం. కాకపోతే ఈసారి మార్పు మాత్రం కాస్త బలంగా ఉండాలి. అన్ని దిశల్లోనూ, అన్ని కోణాల్లోనూ, అన్ని వైపుల నుంచి ఈ మార్పు రావాలి. నిర్మాతలు, దర్శకులు, హీరోలు.. ఏ ఒక్క వర్గమో మారితే కుదరదు. 24 శాఖల్లోనూ ఓ అనూహ్యమైన మార్పు రావాలి. అప్పుడే.. భవిష్యత్తు.
