ఇటీవలి కాలంలో సోషల్మీడియాలో తప్పుడు ప్రచారాలు సినీ ప్రముఖులను కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితికి తీసుకెళ్తున్నాయి. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కూడా న్యాయపరమైన రక్షణ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా విచారణ జరిపారు.
ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా సోషల్మీడియా, ఇ-కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె.సాయిదీపక్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా చర్యలు సోషల్మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.
ఇటివల కాలంలో కొందరు ఎన్టీఆర్ ఫోటోలని మార్ఫింగ్ చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలే కొన్ని పోస్టులు వైరల్ చేశారు. పనిగట్టుకొని ఆయనని కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపధ్యంలో ఆయన కోర్టుని ఆశ్రయించారు. గతంలో ఇలాంటి అంశాలపైనే చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, లాంటి పలువురు సినీప్రముఖులు కోర్టును ఆశ్రయించారు.
