త్రిపుర, బెంగాల్లో కమ్యూనిస్టుల స్థానాన్ని ఆక్రమించిన బీజేపీ ఇప్పుడు వారికి మిగిలిపోయిన ఒకే ఒక్క రాష్ట్రం కేరళలో కూడా బలంగా ముందడుగు వేస్తోంది. కేరళ లోకల్ పోల్స్ లో బీజేపీ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. ప్రతీ సారి ఐదు నుంచి పది వార్డులకు మాత్రమే పరిమితమయ్యే ఆ పార్టీ ఈ సారి మెజార్టీ కార్పొరేటర్ సీట్లను గెల్చుకుంది. అంతకు మించి ఈ స్థానం నలభై ఏళ్లుగా లెఫ్ట్ పార్టీల కూటమి అధీనంలోనే ఉంది. ఇప్పుడు బీజేపీ చేతికి వచ్చింది.
ఈ ఒక్క చోటే అయితే కేరళలో మార్చి మార్చి అధికారాన్ని పంచుకునే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు కాస్త ప్రశాంతంగా ఉండేవేమో కానీ రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపార్టీలలో బీజేపీ నేతలు బలంగా పోరాడారు. వార్డులను గెల్చుకోవడంలో మూడో స్థానంలో నిలిచినా.. ఆ ఫలితాలు మాత్రం అంచనాలకు అందని విధంగా వచ్చాయి. బీజేపీకి బేస్ అంటూ దొరికితే ఎలా విస్తరిస్తుందో అక్కడి పార్టీలకు తెలుసు కాబట్టి కంగారు పడుతున్నాయి.
కేరళలో అడుగు పెట్టాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. లక్కీగా ఓ సీటు దొరకడం తప్ప.. స్థానిక స్థాయిలో ఎప్పుడూ పట్టు సాధించలేదు. కానీ ఈ సారి మాత్రం కింది స్థాయి నుంచి బలపడినట్లుగా కనిపిస్తోంది. శబరిమల వివాదాలు సహా చాలా విధాలుగా ప్రయత్నించారు. ఇప్పుడు మాత్రం యువతను పార్టీ క్యాడర్ గా ప్రోత్సహించి మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ ఫలితాలపై మోదీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కేరళలో బీజేపీ కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
