తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పుంజుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ గణాంకాలు దీనికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 17 శాతం వృద్ధిని నమోదు చేసినట్లుగా గణంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆస్తుల బదిలీలు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరగడం ఈ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణం. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల నుంచి అత్యధిక ఆదాయం లభించింది. ఐటీ రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల కారణంగా శివారు ప్రాంతాల్లో వెలుస్తున్న కొత్త వెంచర్లు , అపార్ట్మెంట్ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యానికి మించి రాబడిని సాధిస్తోంది.
గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్ధత నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు , డిజిటలైజేషన్ ప్రక్రియ వల్ల లావాదేవీల్లో పారదర్శకత పెరిగింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, స్లాట్ బుకింగ్ విధానం సజావుగా సాగడం కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని కలిగించాయి. దీనికి తోడు, ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలు చౌకగా మారే అవకాశం ఉండటంతో, రాబోయే నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేవలం నివాస ప్రాంతాలే కాకుండా, వాణిజ్య సముదాయాలు , వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా ఈ ఆదాయ పెరుగుదలలో కీలక పాత్ర పోషించాయి. ఇదే ఒరవడి కొనసాగితే, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
