ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వబోతున్నారని సమాచారం లీక్ కాగానే హరీష్ రావు చాలా తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్‌కు మీడియా ప్రతినిధుల్ని పిలిపించుకుని చిట్ చాట్ చేశారు. ఇందులో పోలీసులకు డైరక్ట్ వార్నింగ్ ఇచ్చారు. బహుశా ఆయన సజ్జనార్ ను దృష్టిలో ఉంచుకునే ఎక్కువగా మాట్లాడినట్లుగా ఉన్నారు.
అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పేర్లను తాము ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నామని .. ఏపీలో అక్రమాలకు పాల్పడిన అధికారులకు ప్రస్తుతం పట్టిన గతే ఇక్కడి అధికారులకు కూడా పడుతుందని హెచ్చరించారు. రిటైర్ అయినా లేదా విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టకుండా చట్టం ముందు నిలబెడతామన్నారు. పోస్టింగుల కోసం గీత దాటుతున్నారని మండిపడ్డారు. తమపై ఉద్యమం సమయంలో వందల కేసులు ఉన్నాయని మరో కేసుకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
డీజీపీపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఎలాంటి అలవెన్స్ లు అందడం లేదని.. కానిస్టేబుళ్లే డీజీపీపై తిరుగుబాటు చేస్తారని ఆయన వినరని హెచ్చరించారు. డీజీపీ చెబుతున్న ఖాకీబుక్ గురించి కూడా హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ ఆవేశం చూసి జర్నలిస్టులకూ ఆశ్చర్యం వేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన కోపం తెచ్చుకుంటున్నారు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఉన్నారని లీకులు రావడమే దీనికి కారణమని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నోటీసులు వస్తాయని పక్కా సామచారం హరీష్‌కు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

