బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసులన్నీ లొట్టపీసు కేసులని కేటీఆర్ భావిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో గతంలో ఆయన ఇవే వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అదే చెబుతున్నారు. లొట్టపీసు కేసు అని తేల్చేశారు. హరష్ రావు విచారణకు వెళ్లిన తర్వాత తెలంగాణ భవన్ లో ప్రెస్మీట్ పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ కోసమే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించిన సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని హరీష్ రావు బయటపెట్టిన మరుసటి రోజే ఈ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధనను పెట్టి, టెండర్లు వేసే కంపెనీలను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇందులో వాటాలు లేకపోతే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
గతంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చినా, కేవలం వేధించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించి మరీ కోర్టుల్లో వాదిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను వాడుకుని జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని, చట్టాన్ని అతిక్రమించే అధికారులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా, పార్టీ జెండా గద్దెలను ముట్టుకున్నా సహించేది లేదని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
