ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించి అత్యంత కీలకమైన రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాత నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ రూపొందించిన ఐకానిక్ డిజైన్‌తో, సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. 2027 చివరి నాటికి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏమిటి?
సాధారణంగా పెద్ద పెద్ద భవనాలకు పిల్లర్ల కింద విడివిడిగా పునాదులు వేస్తారు. కానీ రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో భవనం మొత్తం విస్తీర్ణంలో ఒకే భారీ కాంక్రీట్ స్లాబ్‌ను పునాదిగా వేస్తారు. దీనిని మ్యాట్ ఫౌండేషన్ అంటారు. అమరావతిలోని నేల స్వభావం కారణంగా భవనం బరువును భూమి అంతటా సమానంగా ఉండేలా చేయడానికి ఈ పద్ధతిని ఎంచుకున్నారు. ఇది భవనానికి స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా చేస్తుంది. ఈ హైకోర్టు భవనం కోసం ఏకంగా 45,000 టన్నుల స్టీల్‌ను వినియోగిస్తున్నారు.
ఐకానిక్ భవనాల్లో హైకోర్టుది ప్రత్యేకత
హైకోర్టు భవనం బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ , 7 అంతస్తులతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 52 కోర్టు హాళ్లు ఉంటాయి. ప్రత్యేకంగా 2, 4, 6 అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్ , అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో నిర్మిస్తున్న ఏడు ఐకానిక్ కట్టడాలలో ఈ హైకోర్టు భవనం అత్యంత ప్రధానమైనది. ప్రస్తుతం ఆపరేషన్ లో ఉన్న హైకోర్టు.. జిల్లా కోర్టుగా మాస్టర్ ప్లాన్ లో ఉంది. హైకోర్టుగా ఉపయోగిస్తున్నారు. ఈ ఐకానిక్ భవనం పూర్తయితే అమరావతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడమే కాకుండా, న్యాయ వ్యవస్థకు అత్యుత్తమ మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి.
ఐకానిక్ భవనాలన్నింటికీ రాఫ్ట్ ఫౌండేషన్
ఐదు సచివాలయ భవనాలతో పాటు అసెంబ్లీని కూడా ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నారు. వీటన్నింటికీ రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నారు. సచివాలయ భవనాలకు గతంలోనే ఈ పనులు పూర్తయ్యాయి. ఐదేళ్ల పాటునీటిలో నానబెట్టేలా గత పాలకులు చేశారు. అయినా అవిచెక్కు చెడలేదు. ఇప్పుడు వాటిపై నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మరో ఏడాదిలో స్పష్టమైన విజిబుల్ డెవలప్మెంట్ ఐకానిక్ భవన్ నిర్మాణాల్లో కనిపిస్తుంది.
