విశ్వక్ సేన్ ప్రస్తుతం `ఫంకీ` సినిమా చేస్తున్నాడు. షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఇప్పుడు మరో సినిమా మొదలెట్టాడు. అదే ‘లెగస్సీ’. పిండం సినిమాతో ఆకట్టుకొన్న సాయి కిరణ్ దైదా దర్శకుడు. గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇదో పొలిటికల్ డ్రామా. తండ్రిని క్షమించలేని కొడుకు కథ కథ ఇది. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, రాజకీయాల్లోకి వచ్చి… ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడో చెప్పే సినిమా ఇది. గ్లింప్స్ లో డైలాగులు ఈ కథనీ, హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేశాయి. చివరి షాట్ అయితే.. ఊహించలేనిది. ఆ షాట్ వల్ల… ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. విశ్వక్ సేన్ గెటప్ కూల్ గా వుంది. యంగ్ పొలిటీషియన్ గా ఆయన పాత్ర తెరపై కనిపించబోతోంది.
రాజకీయాలంటేనే కుట్ర, కుతంత్రాల సమ్మేళనం. శాశ్వత మిత్రులూ, శత్రువులూ ఉండరు. అయిన వాళ్లతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రావొచ్చు. ఈ కథ కూడా అలాంటిదే. ఇంటెన్సిటీ ఉన్న పొలిటికల్ డ్రామాలు చూసి చాలా కాలం అయ్యింది. అందులోనూ యువ హీరోలు ఇలాంటి కథల్ని ఎంచుకోవడం చాలా అరుదు. విశ్వక్ చేసే ప్రయత్నం ఎంత వరకూ ఆకట్టుకొంటుందన్నది ఆసక్తిని కలిగిస్తోంది. ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, కేకే మీనన్, మురళీ మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
