తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నారు తళపతి విజయ్. ఇప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ‘జన నాయకుడు’ తన చివరి సినిమాగా ఆయన ప్రకటించారు. దాంతో ఈ సినిమాపై ఫోకస్ మరింత ఎక్కువైంది. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. ట్రైలర్ అంతా.. విజయ్ ఎలివేషన్లకే వాడుకొన్నారు. అందరూ ఊహించినట్టుగానే కొన్ని పొలిటికల్ పంచ్ లు పడ్డాయి.
‘ప్రజలకు మంచి చేస్తాననుకొని ఇందులోకి రాకు’
‘అర్హత లేనివాళ్లంతా కలిసి నిలబడ్డారు.. వాళ్లు గెలవకూడదు’
‘ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికీ, దోచుకోవడానికేమిట్రా రాజకీయాల్లోకి వచ్చేది..’
ఇలాంటి డైలాగులు తన రాజకీయం ఎలా ఉంటుందో చూపించడానికే అన్నట్టు సాగాయి. అలాగని కమర్షియల్ మీటర్ వదల్లేదు. రెండింటినీ బాగానే బ్లెండ్ చేశారు. ‘యానిమల్’తో మరింత గుర్తింపు తెచ్చుకొన్న బాబీ డియోల్ ఇందులో ప్రతినాయకుడు. ఆయన పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. తెలుగులో ఘన విజయాన్ని అందుకొన్న ‘భగవంత్ కేసరి’ ఈ చిత్రానికి స్ఫూర్తి. అఫీషియల్ రైట్స్ తీసుకొన్నారు కూడా. ఆ కలర్ ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. అయితే.. పూర్తిగా ‘భగవంత్ కేసరి’పై ఆధారపడకుండా విజయ్ క్రేజ్, తన పొలిటికల్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని కథలో మార్పులు చేర్పులూ చేసుకొన్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. జనవరి 9న ‘రాజాసాబ్’తో పాటుగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తమిళంలో విజయ్ సినిమాకి తిరుగు ఉండదు. తెలుగులో ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.
