పాలమూరు ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల ప్రకారం చూస్తే తెలంగాణ నీటి ప్రయోజనాలను బీఆర్ఎస్ రాజకీయం కోసం రిస్క్ లో పెడుతోందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. పాలమూరుపై ప్రేమ ఉన్నట్లుగా చూపిస్తూ అసలే పనులు జరగకుండా చేస్తోదంన్న విషయం అందరికీ స్పష్టత వస్తోందని అంటున్నారు.
ప్రాజెక్టు ముందుకెళ్లాలంటే అనుమతులు, నిధులు అవసరం
కేసీఆర్ చేయగలిగినంత అప్పు చేసి కాళేశ్వంర మీద పెట్టుబడి పెట్టి వెళ్లారు. మరి పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏమిటి?. 80వేల కోట్ల ఖర్చులో 27వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఆలస్యమయ్యేకొద్దీ అంచనాలు పెరుగుతూంటాయి. మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?. ప్రభుత్వం ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు సామర్థ్యం, నీటి కేటాయింపులు, రుణాల సేకరణపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అటు అభివృద్ధికి, ఇటు రాజకీయ యుద్ధానికి వేదికవుతున్నాయి.
45 టీఎంసీల వ్యూహం: అనుమతుల కోసమేనా?
ప్రభుత్వం రికార్డుల్లో ప్రాజెక్టును 45 టీఎంసీల సామర్థ్యంతో చూపడం వెనుక బలమైన ఆర్థిక, సాంకేతిక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందాలన్నా, కేంద్రం నుంచి పర్యావరణ , జలవనరుల అనుమతులు వేగంగా రావాలన్నా క్లీన్ అండ్ క్లియర్ ప్రాజెక్టుగా ఉండటం అవసరం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పెట్టిన భారీ పెట్టుబడులను, పాత అప్పులను తక్కువ వడ్డీ రేట్లకు మార్చుకోవడం ద్వారా ఖజానాపై భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 45 టీఎంసీల వాదన తీసుకు వచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రతిపాదించింది 90 టీఎంసీలు. లక్ష్యం 90 టీఎంసీలు అయినప్పుడు, కేవలం సగం సామర్థ్యానికే పరిమితం కావడం అంటే మిగిలిన సగం వాటాను వదులుకోవడమేనా? అని బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజేస్తోంది.
జూరాల నుంచి ప్రత్యామ్నాయ మార్గం
90 టీఎంసీల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం మరో సమాంతర వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఏడాదికి సుమారు 50 టీఎంసీల నీటిని తోడేలా కొత్త ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల శ్రీశైలంపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, సాంకేతిక చిక్కులు లేకుండా అదనపు ఆయకట్టుకు నీరు అందించవచ్చని సర్కార్ భావిస్తోంది. కానీ, ఈ మార్పులపై స్పష్టత లేకపోవడం, కేవలం లీకులకే పరిమితమవ్వడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. రేవంత్ రెడ్డి పదే పదే ఓ విషయం చెబుతున్నారు. జూరాల నుంచి నీటిని తీసుకుంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి సహా ఎక్కడికి కావాలంటేఅక్కడికి తరలించవచ్చని అంటున్నారు. ఈ మాటల అర్థం అదేనని క్లారిటీ వచ్చింది.
బీఆర్ఎస్ చేసే రాజకీయంతో పాలమూరుకే సమస్య
45 టీఎంసీల పేరుతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి సిద్ధమవుతోంది. దక్షిణ తెలంగాణకు జీవనాడి వంటి ఈ ప్రాజెక్టు విషయంలో రాజీ పడితే సహించేది లేదని గులాబీ దళం హెచ్చరిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే రెండు పార్టీల మధ్య ఘర్షణ తప్పదు. ఈ గందరగోళం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైతే చివరకు నష్టపోయేది తెలంగాణ రైతులే. తెలంగాణ ఎగువ రాష్ట్రం. వరదలు వచ్చినప్పుడు ఎన్ని నీళ్లు తోడుకుంటే…అంత ప్రయోజనం. దిగువకు వెళ్లిపోయాక.. ఏపీ వాడుకుంటోందని ఏడిస్తే ఏం ప్రయోజనం ?. దీన్ని బట్టి చూస్తే రాజకీయంగా ప్రజలకు నష్టం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీనే అని అర్థమైపోతుంది.
