తెలుగువాళ్ల అతి పెద్ద పండగ… సంక్రాంతి. సినిమావాళ్లకు సైతం ఇదే బిగ్ సీజన్. ఈ సీజన్లో విడుదలై కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకొన్నా.. కాసుల వర్షం కురుస్తుందని నిర్మాతలు గట్టిగా నమ్ముతుంటారు. అందుకే సంక్రాంతికి బోలెడు సినిమాలు వరుస కడుతుంటాయి. ఈసారి ఏకంగా 7 సినిమాలు (రెండు డబ్బింగ్ సినిదమాలతో కలుపుకొని) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజలతో పాటుగా శర్వానంద్, నవీన్ పొలిశెట్టి బరిలో దిగారు. దాంతో ఈ సీజన్ ఎలా ఉండబోతోందా? ఎవరికి విజయం దక్కుతుందా? అని టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
సంక్రాంతికి 7 సినిమాలు రావడం బహుశా… ఇదే తొలిసారి కావొచ్చు. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులూ ఒక్కో సినిమా ప్రేక్షకుల్ని పలకరిస్తుంది. ఆ ముందూ వెనుక కూడా సినిమాల హడావుడే. పండగ మొదలు కాకముందే సినిమాల సందడి కనిపిస్తుంది. పండగ అయ్యాక కూడా ఉంటుంది. అదే ఈసారి ప్రత్యేకత. నిజానికి ఇన్ని సినిమాలు వరుసగా రావడంలో ఎంత ఆనందం ఉంటుందో, అంతే ఇబ్బంది కూడా ఉంటుంది. పెద్ద సినిమాలు థియేటర్లని ఆక్రమించుకొంటాయి. మీడియం రేంజ్ సినిమాలకు థియేటర్లు పెద్దగా దొరకవు. బయ్యర్లు కూడా కేవలం అడ్వాన్సులే చెల్లించగలరు. సో… నిర్మాతలు తమ సొంత రిస్క్ మీద సినిమాల్ని విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఇన్ని సినిమాల్ని భరించే శక్తి ఉందా, లేదా? అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారానికి ఒకటీ, రెండు సినిమాలంటే ఫర్వాలేదు. ఒకేవారం దాదాపు 7 సినిమాలు వస్తున్నాయి. కుటుంబ సమేతంగా ఈ సినిమాల్ని చూడాలంటే కనీసం రూ.15 వేలైనా ఉండాలి. సగటు ప్రేక్షకుడు అంత భరించాలనుకోవడం ఆత్యాసే. కాబట్టి.. ఇక్కడ టాక్ ప్రధానం అవుతుంది. చిరు, ప్రభాస్ సినిమాలకు టాక్ తో పని లేకుండా జనాలు థియేటర్లకు వెళ్తారు. మిగిలిన సినిమాలకు టాక్ ముఖ్యం. మంచి సినిమాల్ని వదులుకోవడానికి ప్రేక్షకులు ఇష్టపడరు. వాటిని థియేటర్లో చూడాల్సిందే. సో.. ఏ సినిమాకు పాజిటీవ్ టాక్, రివ్యూలు వస్తే, ఆ సినిమాలకు ఎక్కువ టికెట్లు తెగుతాయి.
ఈ సంక్రాంతి సినిమాల మినిమం వాల్యూ దాదాపు రూ.1000 కోట్లు. ‘రాజాసాబ్’ బడ్జెట్ అటూ ఇటుగా రూ.500 కోట్లు అయ్యిందని చిత్రబృందం చెబుతోంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కోసం రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక మిగిలిన మూడు సినిమాలకూ 100 కోట్ల లెక్క వేసుకొన్నా రూ.800 కోట్లు తేలుతున్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి.. అటూ ఇటుగా రూ.1000 కోట్లు అన్నమాట. నిర్మాతల చేతికి రూ.1000 కోట్లు రావాలంటే బాక్సాఫీసు దగ్గర ఈ సినిమాలన్నీ కలిపి దాదాపు రూ.1500 కోట్లు చేయాలి. అప్పుడే ఈ సినిమాలు, ఆయా నిర్మాతలు గట్టెక్కుతారు. ఒకే సీజన్ లో రూ.1500 కోట్లు ఇవ్వగలిగే సత్తా తెలుగు ప్రేక్షకులకు ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాకపోతే ఇది పండగ సీజన్. జనాలు ఖర్చు పెట్టే మూడ్ లోనే ఉంటారు. ఇంటిల్లిపాదీ కలిసి సినిమా చూడడం కంటే ఇంకేం కావాలి? కాబట్టి ప్రేక్షకులూ సిద్ధంగానే ఉన్నారన్నది నిర్మాతల ధైర్యం. ఈ నమ్మకం ఎంత వరకూ నిజం అవుతుందో తెలియాలంటే సంక్రాంతి సీజన్ ముగిసేంత వరకూ ఎదురు చూడాలి.
