బీజేపీ చేసే రాజకీయాలను అంచనా వేయడం కష్టం కాదు. కానీ ఆ రాజకీయాలను అంచనా వేసి ఆ పార్టీకి చిక్కకుండా ఉండటమే కష్టం. అది విజయ్ లాంటి బిగినర్స్‌కు ఇంకా చాలా కష్టం. అందుకే నేరుగా వెళ్లి ఆ పార్టీ వేసిన ట్రాప్‌లో చిక్కుకున్నారు. అలా చిక్కుకున్నారని తెలియ చెప్పేవే జననాయగన్ విడుదలకు ఏర్పడుతున్న అడ్డంకులు.
సెన్సార్ దాటలేకపోతున్న జననాయగన్
విజయ్ నటించిన జననాయగన్ చిత్రం ఈ నెల 9న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో సెన్సార్ బోర్డు నుండి ఎదురవుతున్న అడ్డంకులు విడుదలపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఈ చిత్రంలో అభ్యంతరకర అంశాలు ఏమీ లేవని చిత్ర యూనిట్ వాదిస్తున్నప్పటికీ, సాయుధ దళాల చిత్రీకరణ , కొన్ని మతపరమైన అంశాలపై వచ్చిన ఫిర్యాదుల సాకుతో సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టు గడప తొక్కారు. బుధవారం నాటి విచారణలో ఫిర్యాదుల వివరాలను సమర్పించాలని కోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. కానీ ఈ ప్రభావం ఇప్పటికే సినిమాపై పడింది.
ఓవర్సీస్ రిలీజ్ ఆలస్యం
సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో అమెరికా, మలేషియా వంటి విదేశాల్లో ప్లాన్ చేసిన ప్రీమియర్ షోలను రద్దు చేయాల్సి వచ్రాచింది. నిర్మాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఒక సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఇటువంటి పరిస్థితులు తలెత్తడం వెనుక రాజకీయం లేదని ఎవరూ అనుకోలేరు. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో బీజేపీని భావజాల శత్రువు గా, డీఎంకేను రాజకీయ శత్రువు గా ప్రకటిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం విజయ్ను ప్రేమిస్తోంది. పొత్తుల కోసం గేమ్ ఆడుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
పొత్తు కోసం ఒత్తిడి తంత్రం ?
ఇది కేవలం సినిమాపై దాడి కాదు, విజయ్ను లొంగదీసుకునేందుకు జరుగుతున్న గేమ్ ప్లాన్ అనుకోవచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి ఇదొక శాంపిల్ అని, ఒకవేళ లొంగకపోతే భవిష్యత్తులో సీబీఐ లేదా ఈడీ దాడులు కూడా ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే విజయ్‌పై సీబీఐ కేసు వేలాడుతూ ఉంది. కరూర్ ఘటనలో ఆయనపై కేసు నమోదు చేసినా ఆశ్చర్యం ఉండదని అనుకోవచ్చు.
సేఫ్ రాజకీయాలు చేయగలగాలి!
విజయ్ ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. తన సినిమాను కాపాడుకోవడానికి రాజీ పడతారా లేదా అన్నది ఇక్కడ సమస్య కాదు. ఇప్పుడు సినిమా బయటపడినా రేపు రాజకీయాల్లో అంత కంటే ఎక్కువ సమస్యలు వస్తాయి. సినిమా విషయంలోనే ఇలా ఉంటే.. ఇక బీజేపీ తో పొత్తు పెట్టుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో..సీబీఐ ట్రైలర్ చూపించే అవకాశం ఉంది. తమిళనాడులో విజయ్.. బీజేపీ రాజకీయాన్ని ఫేస్ చేస్తున్నారు. ఎదుర్కొంటారో..లొంగిపోతారో చూడాల్సి ఉంది.


