ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన కనీసం ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వంపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆరు స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే వీలుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండానే జీతభత్యాలు, అలవెన్సులు తీసుకుంటున్న ఎమ్మెల్యేల వ్యవహారంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ ఇప్పటికే సీరియస్ అయింది.
ఎథిక్స్ కమిటీ ఆగ్రహం – అనర్హత ముప్పు
ఎథిక్స్ కమిటీ సమావేశంలో చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీపై కీలక చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం, స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరుకాకపోతే సదరు సభ్యత్వంపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ 60 రోజుల గడువు పూర్తి కానుండటంతో, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉంది. సభకు రాకుండా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకోవడం నైతికంగా తప్పని, దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టాలని కమిటీ భావిస్తోంది.
వ్యూహాత్మక తప్పిదమా?
ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామన్న మొండి వైఖరి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు శాపంగా మారేలా ఉంది. అసెంబ్లీకి వెళ్లడం అనేది ఎమ్మెల్యేల హక్కు మాత్రమే కాదు, అది వారి ప్రాథమిక బాధ్యత. ప్రజలు తమ సమస్యల కోసం గొంతు వినిపిస్తారని నమ్మి ఓటు వేస్తే, పదవుల్లో ఉండి సభకు దూరంగా ఉండటంపై ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇదే కారణంతో అనర్హత వేటు పడి ఉపఎన్నికలు వస్తే, ప్రజా బాధ్యతను విస్మరించారు అనే నిందతో ప్రజల వద్దకు వెళ్లడం ఆ నేతలకు గడ్డు కాలమే అవుతుంది. ఈ పరిణామాలు అధికార కూటమికి రాజకీయంగా కలిసివచ్చేలా ఉన్నాయి. ఆరు స్థానాల్లో ఉపఎన్నికలు వస్తే, వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీని ప్రధాన అస్త్రంగా మార్చుకుని కూటమి ప్రచారం చేసే అవకాశం ఉంది.
వారికి మద్దతుగా జగన్ కూడా రాజీనామా చేయక తప్పదా ?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. కానీ రాజ్యాంగపరంగా స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం కావడంతో అక్కడ ఊరట లభించడం కష్టమే. అయితే, తన ఎమ్మెల్యేలపై వేటు వేస్తే దానికి నిరసనగా మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరే సాహసోపేత నిర్ణయం జగన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నాటికి ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎథిక్స్ కమిటీ ఇప్పటికే ఎమ్మెల్యేల వివరణ కోరాలని నిర్ణయించింది. వారు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలు తప్పవు. ఒకేసారి ఆరు స్థానాల్లో ఉపఎన్నికలు రావడం అంటే అది మినీ సాధారణ ఎన్నికల తరహాలోనే ఉంటుంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి అనుకూలంగా మారుతుందో, ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో అన్నది ఆ ఉపఎన్నికలతో తేలిపోతుంది.
