తెలంగాణలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిణిని , మంత్రి కోమటిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రసారం చేసిన అసత్య కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐఏఎస్ అధికారుల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా, వారి పోస్టింగ్స్‌ను రాజకీయ నాయకులతో ముడిపెడుతూ వస్తున్న కథనాల కుట్రలను ఛేదించాలని పోలీసులను ఆదేశించింది. ఈ వివాదం జనవరి 8న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తతో మొదలైంది. సదరు మహిళా అధికారిణికి ఒక రాజకీయ నాయకుడితో వ్యక్తిగత అనుబంధం ఉందంటూ, ఆ సాన్నిహిత్యంతోనే ఆమెకు పోస్టింగ్స్ లభించాయని ఆ కథనంలో ఆరోపించారు.
దీనిపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నిరాధారమైన, మహిళా అధికారుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ కథనంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సదరు ఛానల్ యాజమాన్యం, ఎడిటర్లతో పాటు దీన్ని వైరల్ చేసిన పలు డిజిటల్ మీడియా సంస్థలపై కేసులు నమోదయ్యాయి. ఈ కథనాల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వం.. ఆ కుట్రలను తేల్చేందుకు సిట్ ను నియమించింది. ఇప్పటికే బీఆర్ఎస్కు మద్దతుగా ఉండే పలు యూట్యూబ్ చానళ్లపై కేసులు నమోదు చేశారు.
