ప్రతి ఒక్కరూ తాము పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోకూడదని, పుట్టిన ఊరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నారావారిపల్లిలో ఆయన మాట్లాడారు. ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు గ్రామ సేవకు పునరంకితం కావాలని కోరారు. గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పి4 విధానాన్ని ప్రవేశపెట్టామని, ఇప్పటికే 10 లక్షల కుటుంబాలను ఈ పద్ధతి ద్వారా దత్తత తీసుకున్నామని వెల్లడించారు.
ఆర్థిక అసమానతలు తొలగించి సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. నారావారిపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతూ కందులవారిపల్లి, రంగంపేటలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. స్వర్ణ నారావారిపల్లి లో భాగంగా 147 మంది నిరుపేదలకు ఏడాదిలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం రిజర్వాయర్లలో 950 టీఎంసీల నీరు ఉండటం శుభపరిణామమని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 2026 చివరి నాటికి సంజీవిని ప్రాజెక్టును ప్రారంభిస్తామని, దీనికి నారావారిపల్లి నుంచే శ్రీకారం చుట్టామని ప్రకటించారు. సోలార్ పవర్ సిస్టమ్, ప్రకృతి సేద్యం వంటి వినూత్న పద్ధతులతో గ్రామాలను పరిశుభ్రంగా మార్చడమే కాకుండా, 2027 నాటికి రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2047 నాటికి ‘స్వర్ణ ఆంధ్రప్రదేశ్ – వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే తన ఆశయమని చంద్రబాబు చెప్పారు.
