వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగే అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. తదుపరి దర్యాప్తునకు అనుమతి ఇచ్చినా ట్రయల్ కోర్టు కొన్ని ఆంక్షలు పెట్టడంతో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి సీబీఐని కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అడిగింది.
ఈకేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని అనుకుంటున్నారా.. ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారు.. వంటి అంశాలపై తెలిపితే పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ సీరియస్ గా ఉంటే .. సుప్రీంకోర్టు వద్ద ఆంక్షల్లేని దర్యాప్తు కోసం గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. జరిగిన విచారణ చాలనుకుంటే లైట్ తీసుకునే అవకాశం ఉంది.
అసలు ఈ కేసులో ప్రధానమైన అంశం … హత్య జరిగిన విషయంబయట ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి దంపతులకు తెలిసింది. అలా ఎలా తెలిసింది.. ఫోన్ చేసిన వారు ఎవరు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ట్రయల్ కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అందరికీ తెలిసిన తర్వాతనే వారికి తెలిసిందని..బంధువులకు సమాచారం ఇచ్చుకోవడం సహజమేనని వ్యాఖ్యానించింది. సీబీఐ ఈ అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తుందో లేదో తదుపరి దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.
