ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు విభజన చట్టానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భంలో కూడా రాజకీయం చేసేందుకు వైసీపీ ఎంపీలు కుట్రలు పన్నుతున్నారు. రైతులకు న్యాయం చేయాలనే సాకుతో బిల్లును అడ్డుకోవడమో లేదా సభలో రచ్చ చేయడమో చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
రైతులకు న్యాయం.. అంటే అర్థమేంటి?
అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని ఎంపీ మిథున్ రెడ్డి అంటున్నారు. అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెబుతున్నారు. ఈ మాటలను విని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు రైతులకు అన్యాయం చేసింది ఎవరు? అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి నిర్మాణం వేగంగా సాగుతున్నప్పుడు, రాజధాని ప్రాంతం ఒక అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో.. దానికి బ్రేకులు వేసింది వైఎస్ జగన్ కాదా? మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల పాటు అమరావతిని అడవిగా మార్చిన పాపం వైసీపీది కాదా?
ఐదేళ్ల విధ్వంసం.. వందల మంది రైతుల బలి
అధికారంలోకి రాగానే రాజధాని పనులను ఆపేసి, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ రైతులపై బురద చల్లిన వైసీపీ, వారిని ఐదేళ్ల పాటు మానసిక వేదనకు గురిచేసింది. 1,600 రోజులకు పైగా రైతులు రోడ్లపై పోరాటం చేస్తున్నా కనికరించని నాటి ప్రభుత్వం, రైతుల ప్రాణాలు పోవడానికి పరోక్షంగా కారణమైంది. అమరావతిని గ్రాఫిక్స్ అని, శ్మశానం అని అవమానించిన నేతలే.. ఇప్పుడు అదే రైతుల ప్రయోజనాల గురించి పార్లమెంట్లో మాట్లాడుతామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. 2019లో అధికార మార్పిడి జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రారంభించిన నిర్మాణాలను జగన్ ప్రభుత్వం కొనసాగించి ఉంటే.. ఈ పాటికి అమరావతి నిర్మాణం పూర్తయ్యేది. భూములిచ్చిన రైతుల ప్లాట్లు అభివృద్ధి చెంది వారికి ఆర్థికంగా ఎంతో మేలు జరిగేది. కానీ, కక్షపూరిత రాజకీయంతో రాజధానిని భ్రష్టు పట్టించి, ఇప్పుడు బిల్లు వచ్చే సరికి రైతులకు న్యాయం అని కొత్త రాగం అందుకున్నారు. బిల్లులో రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడం ద్వారా, బిల్లును జాప్యం చేయాలన్నదే వైసీపీ అసలు కుట్రగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్లమెంట్లో వైసీపీ ద్వంద్వ వైఖరి
ఒకవైపు జగన్ అమరావతి అనేది ఒక వృథా ప్రాజెక్టు అని బహిరంగంగా చెబుతుంటే, ఆయన అనుచరుడు మిథున్ రెడ్డి మాత్రం తాము అమరావతికి వ్యతిరేకం కాదని, రైతులకు న్యాయం చేయాలని పార్లమెంట్లో పోరాడుతామని చెప్పడం వారి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. అమరావతికి చట్టబద్ధత వస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా మార్చడానికి వీలుండదు. ఈ శాశ్వత హోదా తమ రాజకీయ మనుగడకు ప్రమాదమని భావిస్తున్న వైసీపీ, రైతులను అడ్డుపెట్టుకుని బిల్లుపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. అమరావతి రైతులకు నిజంగా న్యాయం జరగాలంటే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉంది. అది వదిలేసి, ఐదేళ్ల పాటు రైతులను రాచిరంపాన పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు వారి పేరు చెప్పి పార్లమెంట్లో డ్రామాలు ఆడితే ప్రజలు క్షమించరు. న్యాయం అనే పదానికి వైసీపీ నిర్వచనం ఏంటో ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది.
