తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో తెలంగామ నుంచి భారీ స్థాయిలో చేరికలను ప్రోత్సహించడం, సమన్వయ కమిటీలను నియమించడం వంటి చర్యలతో కేడర్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మీడియా గ్రూపులు, సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారం చూసి, ఈసారి తెలంగాణ పురపాలక పోరులో జనసేన ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతుంద ప్రకటనుల చేశారు. కానీ, తీరా నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఆ హడావుడి కనిపించడం లేదు.
ఎంత మంది జనసేన తరపున బరిలో నిలిచారు?
ఎన్నికల బరిలో నిలవాలని ఉత్సాహం చూపిన అభ్యర్థులకు పార్టీ తరపున కనీస మార్గదర్శకత్వం కరువైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది..ఎంతమందికి పార్టీ అధికారికంగా ‘బీ-ఫారాలు’ అందజేసింది? అనే విషయంలో పార్టీ నాయకత్వానికే స్పష్టత లేనట్లుగా కనిపిస్తోంది. పార్ తరపున బరిలోకి దిగాలనుకున్న అభ్యర్థులు, చివరి నిమిషంలో ఎవరిని సంప్రదించాలో తెలియక, బి-ఫారాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఉత్సాహం చూపిన వారికి బీ ఫారాలు అందించలేకపోయారా?
హైప్రొఫైల్ నేతలు మీడియా ముందు కనిపించినంత వేగంగా, క్షేత్రస్థాయిలో అభ్యర్థులను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. తెలంగాణలో జనసేనకు బలమైన యువ ఓటు బ్యాంకు ఉందని పవన్ నమ్మకం. దానిని ఓట్లుగా మార్చుకునే వ్యూహరచనలో పార్టీ ఎప్పుడూ వెనుకబడే ఉంటోంది. మున్సిపల్ ఎన్నికల వంటి స్థానిక పోరాటాల్లో పార్టీ గుర్తింపు అనేది అత్యంత కీలకం. కానీ, సమయానికి బీ-ఫారాలు ఇవ్వలేకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు స్వతంత్రులుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది పార్టీ ఉనికిని చాటుకోవాలనుకున్న తరుణంలో తీవ్ర ఇబ్బందికరమైన అంశం.
పార్టీ బలోపేతం కోసం సమగ్ర కార్యాచరణ అవసరం
తెలంగాణపై పవన్ కల్యాణ్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఆయన పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. అయితే ఏపీలో అధికార విధుల్లో ఆయన చాలా బిజీగా ఉంటున్నారు. రామ్ తాళ్లూరి ఇక్కడ నాయకత్వాన్ని తీసుకుని మరింతగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కానీ ఆయన కూడా తొలి అడుగుల్లో విజయవంతం కాలేకపోతున్నారు. ఈ అంశంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని జనసేన తెలంగాణ నేతలు భావిస్తున్నారు.
