తెలంగాణాలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత చాలా కాలం పాటు మౌనంగా దాని పనితీరుని అధ్యయనం చేసిన తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఇప్పుడు దానిలో లోటుపాట్లని, తప్పులని ఎత్తిచూపుతూ నిలదీస్తున్నారు. ఆయన మొదటి నుంచి దానిని చాలా విషయాలలో సున్నితంగా హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ ఏనాడూ వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆయన మౌనంగానే ఉండిపోవడంతో తెరాస ప్రభుత్వం ఆయనని చాలా తక్కువగా అంచనా వేసింది. దాని అంచనాలని తలక్రిందులు చేస్తూ ఆయన ఒక్కో అంశంపై నిలదీస్తుంటే మేల్కొని నష్టనివారణ చర్యలు చేప్పట్టకపోగా, తమని విమర్శిస్తున్నందుకు అసహనం వ్యక్తం చేస్తూ ఆయనపై ఎదురుదాడి చేసి, అన్ని వర్గాల నుంచి విమర్శలు మూటగట్టుకొంది. అందుకే ఆయన సాగునీటి ప్రాజెక్టులపై అద్యయనం కోసం మహబూబ్ నగర్ పర్యటనకి బయలుదేరినప్పుడు, ప్రాజెక్టులలో లోటుపాట్లని వివరిస్తున్నప్పుడు తెలంగాణా ప్రభుత్వం ప్రతివిమర్శలు చేయకుండా మౌనం వహించింది. కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఆయన విమర్శలు చేసినప్పుడు మాత్రం ప్రతిపక్షాలతో కలిసి అభివృద్ధికి అడ్డుపడటం తగదని సున్నితంగా హితవు పలికింది. కానీ ఆయన మాత్రం తెలంగాణా ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగించాలనే నిర్ణయించుకొన్నట్లున్నారు.
తాజాగా తెలంగాణాలో యువతకి ఉద్యోగాలు, ఉపాధి అంశంపై పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేసి, ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు? యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏమేమీ చర్యలు చేపట్టింది? వగైరా వివరాలు తెలుపుతూ ప్రభుత్వం వ్యూహపత్రం విడుదల చేయాలని కోరారు. విద్యా, ఉద్యోగాలకి సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు సందించి ఇకపై తెలంగాణా ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని హెచ్చరించారు. ఉద్యోగాల సాధన కొరకు యువతతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణా ఏర్పడితే యువతకి ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఉద్యమ సమయంలో కెసిఆర్ చాలా గట్టిగా వాదించేవారు. కానీ ఆయనతో కలిసి పోరాడిన ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఆయనని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు అటువంటి విమర్శలు చేస్తే అవి తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ విధంగా మాట్లాడుతున్నాయని సర్దిచెప్పుకోవచ్చు కానీ ప్రొఫెసర్ కోదండరాం రాజకీయాలకి అతీతంగా ఉంటున్న వ్యక్తి. తెలంగాణా ప్రజలలో చాలా గౌరవమర్యాదలు పొందుతున్న వ్యక్తి. కనుక ఆయన చేస్తున్న ఈ సూచనలని, హెచ్చరికలని తెలంగాణా ప్రభుత్వం తేలికగా తీసుకొంటే మున్ముందు ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఆయన చెపుతున్న విషయాలపై ఇప్పుడే దృష్టి పెట్టి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవడం మంచిది. వీలైతే భేషజాలు పక్కనపెట్టి ఆయనతో చర్చించడం, ఆయన సూచనలు, సలహాలు తీసుకోవడం ఇంకా మంచిది. ఆయన తెలంగాణా ప్రభుత్వానికి హితవు కోరే వ్యక్తే కానీ శత్రువు కాదని గ్రహిస్తే మంచిది.