ఓ సినిమాకి పాజిటీవ్ బజ్ రావడం మామూలు విషయం కాదు. దర్శక నిర్మాతలు కోరుకొనేది అదే. `సినిమా బాగుంది` అని జనం మాట్లాడుకొంటే, పాజిటీవ్ రివ్యూలొస్తే… ఆ సంబరాలకు హద్దుండదు. మనమంతాకి ఇదే జరిగింది. ఎవరి నోట విన్నా…. చాలా మంచి సినిమా అనే మాటే వస్తోంది. ఒక్కరు కూడా నెగిటీవ్ గా మాట్లాడుకోవడం లేదు.కానీ ఏం లాభం?? ఈ సినిమా ఓపెనింగ్స్ మరీ పూర్ గా ఉన్నాయి. చంద్రశేఖర్ యేలేటి కెరీర్లోనే బెస్ట్ మూవీ అని కితాబు ఇచ్చినా.. ఈ సినిమాపై కనికరం చూపించడం లేదెవ్వరూ. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జస్ట్ ఓకే మూవీ అనిపించుకొన్న శ్రీరస్తు శుభమస్తు సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కడం విశేషం.
మనమంతా సినిమాని ముందు నుంచీ.. మల్టీప్లెక్స్ సినిమాగానేచూసుకొంటూ వచ్చారంతా. చిత్రబృందం టార్గెట్ కూడా అదే. కనీసం మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా చూసినా సరిపోతుందనుకొన్నారు. అయితే… శుక్రవారం మల్టీప్లెక్సులు కూడా ఖాళీగా కనిపించాయి. కనీసం 20 శాతం టికెట్లు కూడా తెగకపోవడం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరుస్తోంది. భీమవరం లాంటి సెంటర్లో.. ఓ షోకి కేవలం రూ.3 వేల రూపాయలొచ్చాయట. అదే.. శ్రీరస్తు శుభమస్తుకి రూ.60 వేలు దక్కాయట. దీన్ని బట్టి ఈ రెండు సినిమాల మధ్య వ్యత్యాసం ఎంత ఉందో అంచనా వేయొచ్చు. మంచి సినిమాలు రావడం లేదు అని నిందించడం మాని, వచ్చినప్పుడు చూడడం మన బాధ్యత అనుకోవాలి. లేకపోతే… మనమంతా లాంటి మంచి సినిమాలు ఎప్పటికీ రావు. కనీసం శనివారం నుంచైనా వసూళ్లు పెరుగుతాయని చిత్రబృందం నమ్మకం పెట్టుకొంది. ఏమవుతుందో చూడాలి.