ఈనెల 19న విడుదల కాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పెద్ద సినిమా రిలీజ్ అనగానే టికెట్ రేట్ల గురించి చర్చ మొదలవ్వడం సహజం. ‘ఉస్తాద్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈసారి కూడా టికెట్ రేట్ల పెంపు ఉంటుందా, బెనిఫిట్ షోల రేట్ ఎంత? అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. బెనిఫిట్ షో రేట్ రూ.500గా నిర్ణయించింది. పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకొనే వెసులుబాటు కూడా కల్పించింది. మల్టీప్లెక్స్ కు రూ.125, సింగిల్ స్క్రీన్కు రూ.100 పెంచుకొనే సౌలభ్యం ఇచ్చింది.
బెనిఫిట్ షో రూ.500 అంటే ఫర్వాలేదు. ఎందుకంటే ఈమధ్య ఒక్కో సినిమాకు రూ,800 నుంచి రూ.1000 వరకూ వసూలు చేశారు నిర్మాతలు. వాటితో పోలిస్తే.. ‘ఉస్తాద్’ రేట్లు ఓకే అనేలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే జీవో జారీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఇంచు మించుగా ఈ రేట్లే ఫిక్సయ్యే ఛాన్స్ వుంది. జీవోలు వచ్చేస్తే బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి.
18న బెనిఫిట్ షోలతో ‘ఉస్తాద్’ ఆట మొదలవుతుంది. 19న ఉగాది పండగ. 20 న రంజాన్ ఉంది. అలా.. వరుసగా సెలవులు కలిసి వస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో ‘ఉస్తాద్’ హవా గట్టిగా చూపించే అవకాశం ఉంది. టాక్ బాగుంటే.. సెకండ్ వీక్ లోనూ వసూళ్లు దండుకోవొచ్చు. ఉస్తాద్ నుంచి ఇప్పటికే 3 పాటలు, టీజర్ వచ్చాయి. 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఆ సందర్భంగా ట్రైలర్ విడుదల చేస్తారు. మరో పాట కూడా బయటకు రావాల్సివుంది. రాశీఖన్నా, శ్రీలీల కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, తమన్ సంగీతాన్ని అందించారు.
