పార్టీ కార్యక్రమాలు , ప్రజా సమస్యల గ్రీవెన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షలో భాగంగా, కడప నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి , ఎమ్మెల్సీ బి.టెక్ రవితో పాటు వరదరాజులు రెడ్డి, ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ సహా పలువురు ఎమ్మెల్యేల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో విఫలమవడం పై ఆయన వారిని నిలదీశారు.
ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చకపోతే అది పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని లోకేష్ హెచ్చరించారు. గ్రీవెన్స్ డే నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రతి నేత తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని నేతలకు రాబోయే రోజుల్లో ప్రాధాన్యత తగ్గించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.
రెడ్డిపగారి మాధవి కడపలో పార్టీని సమన్వయం చేయడంలో వెనకబడ్డారని, అలాగే బి.టెక్ రవి కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో విఫలమవుతున్నారని లోకేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఐక్యంగా పనిచేయాలని ఆయన గట్టిగా ఆదేశించారు. కేవలం పదవులు అనుభవించడం కాకుండా, కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మరియు పార్టీకి బలమైన పునాది వేయడంలో ప్రతి నేత బాధ్యతాయుతంగా ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే వారి విషయంలో ‘రెడ్ బుక్’ తరహాలోనే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, నిరంతరం పనితీరును పర్యవేక్షిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
