తమిళనాడులో విజయ్ తన కొత్త పార్టీ టీవీకే ద్వారా సంచలనం సృష్టించబోతున్నారని యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా వేసింది. ఎన్నికల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లో మంచి రికార్డు ఉన్న ఈ సంస్థ 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార పార్టీ డీఎంకే కు 110 స్థానాల దరిదాపుల్లోనే సీట్లు వస్తాయని అంచనా వేసింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు.
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని కూటమికి కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఎదురైనప్పటికీ, వారి సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోరు సాగడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే సూచనలు ఉన్నాయని, లేదా స్వల్ప తేడాతో ఎవరో ఒకరు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను ను అందుకుంటారని ఈ సర్వే విశ్లేషిస్తోంది.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే కు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఈ పార్టీకి కేవలం 22 స్థానాలు మాత్రమే లభిస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేయడం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకే ఓటు బ్యాంకును విజయ్ పార్టీ భారీగా చీల్చడం వల్ల ఆ పార్టీ ఈ స్థాయిలో వెనుకబడిందని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అన్నాడీఎంకే బలహీనపడటం విజయ్ పార్టీకి బాగా కలిసివచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తానికి యాక్సిస్ మై ఇండియా అంచనాలు నిజమైతే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది ఒక చారిత్రక మలుపు కానుంది. రాష్ట్రాన్ని శాసిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, ఒక సరికొత్త పార్టీ అధికార పీఠానికి చేరువ కావడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షాన్ని మూడవ స్థానానికి నెట్టివేసినట్లు అవుతుంది. ఇవి కేవలం ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రమేనని, మే 4వ తేదీన వెలువడే అసలు ఫలితాల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
