తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే విజయ్ పాత్ర ఏమిటన్నది ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో ఒకవేళ ఏ కూటమికి 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ రాకపోతే, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది. విజయ్ మొదటి నుంచి తన ప్రచారంలో అధికారంలో వాటా అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. అంటే, కేవలం బయట నుంచి మద్దతు ఇచ్చి ఊరుకోకుండా, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన పట్టుబట్టే అవకాశం ఉంది.
బీజేపీ , అన్నాడీఎంకే.. విజయ్ను సీఎంను చేస్తాయా?
ఒకవేళ డీఎంకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తే, స్టాలిన్ తన సీఎం పీఠాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి, డీఎంకే వైపు వెళ్లడం కంటే, తన డిమాండ్లకు తలొగ్గే కూటమి వైపు విజయ్ మొగ్గు చూపవచ్చు. డీఎంకేను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ డీఎంకే మెజారిటీకి స్వల్ప దూరంలో ఉంటే, ఆ పార్టీని అడ్డుకోవడానికి బీజేపీ-అన్నాడీఎంకే కూటమి విజయ్‌కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసి, బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడవచ్చు. దీనివల్ల డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, రాబోయే ఐదేళ్లలో విజయ్ ఇమేజ్ను వాడుకుని క్షేత్రస్థాయిలో తమ పట్టును పెంచుకోవచ్చని వారి ప్లాన్. అయితే, విజయ్ తన సెక్యులర్ ఇమేజ్ను పణంగా పెట్టి బీజేపీ మద్దతు తీసుకుంటారా? అనేది అతిపెద్ద ప్రశ్న.
హంగ్ వస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమే
ఇలాంటి హంగ్ పరిస్థితుల్లో విజయ్‌కు ఎదురయ్యే అతిపెద్ద ముప్పు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం. ద్రవిడ పార్టీలైన డీఎంకే , అన్నాడీఎంకేలకు దశాబ్దాల రాజకీయ అనుభవం, అంగబలం, అర్థబలం ఉన్నాయి. విజయ్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొత్తవారు కావడంతో, వారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే కుట్రలను అడ్డుకోవడం విజయ్‌కు ఒక అగ్నిపరీక్షే. అందుకే, ఫలితాల తర్వాత తన ఎమ్మెల్యేలను నేరుగా తన వద్దకే ఇచ్చేయాలని ఆయన ఆదేశించారు.
ఇప్పటికే డీఎంకే ఆపరేషన్ స్టార్ట్
డీఎంకే కూడా ఊరికే కూర్చోదు. ఒక నటుడి కింద పనిచేయడం కంటే, బలమైన పునాది ఉన్న డీఎంకేలో చేరడం మేలు అని విజయ్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టవచ్చు. ఇప్పటికే గెలిచే అవకాశం ఉందన్న ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ తన ఎమ్మెల్యేలను తన వెంట ఉంచుకోలేకపోతే, కింగ్ మేకర్ కావాలన్న ఆయన కల కింగ్ కాకముందే కాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే, విజయ్ ఇప్పటికే తన నమ్మకస్థులతో ఒక కోర్ కమిటీ ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల భద్రతపై కసరత్తు చేస్తున్నారు.
మే4న మధ్యాహ్నానికి అసలైన రాజకీయం
ముగింపుగా చూస్తే, మే 4 ఫలితాలు తమిళనాడులో సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలకబోతున్నాయి. విజయ్ కింగ్ అవుతారా లేక కింగ్ మేకరా.. లేకపోతే ఆయనదంతా బాక్సాఫీసు తరహా హైప్ అని తేలిపోతుందా అన్నది తేలిపోతుంది. ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే, తమిళనాడు రాజకీయాలు రిసార్టుల చుట్టూ, బేరసారాల చుట్టూ తిరగడం ఖాయమని స్పష్టమవుతోంది.
