ఏపికి ప్రత్యేక హోదా, తదితర హామీల అమలుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా చాలా ఒత్తిడి తెస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఆయన అభ్యర్ధనలని పట్టించుకోలేదు. కానీ ప్రత్యేక హోదా కోరుతూ కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎంపిలు, ఏపిలో ప్రతిపక్షాలు ఏదో మొక్కుబడిగా హడావుడి చేసి ఊరుకొంటాయనుకొన్న జైట్లీకి ప్రతిపక్షాలు గట్టి షాకే ఇచ్చాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుబట్టడంతో తాము వెనక్కి తగ్గితే రాజకీయంగా దెబ్బ అయిపోతామనే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈసారి కేంద్రానికి చాలా గట్టి హెచ్చరికలే చేశారు. దానితో కేంద్రప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
ఏపికి ప్రత్యేక ప్యాకేజి, హోదా, రైల్వేజోన్, రెవెన్యూ లోటు భర్తీ, షెడ్యూల్: 9,10 సంస్థల విభజనతో సహా అన్ని హామీలు, సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ సుజనా చౌదరి డిల్లీలో నిన్న సమావేశమయ్యి చర్చలు జరిపారు. కనుక కేంద్రంలో ఈ కదలిక రావడానికి కెవిపి రామచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు, దానిపై జరిగిన చర్చలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన వ్యతిరేక సమాధానమే ఈ ప్రత్యేక వేడిని రగిలించాయని చెప్పకతప్పదు. మళ్ళీ మొన్న స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హామీల అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి ఇంకా పెరిగింది.
ఇంతవరకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెపుతూ వచ్చిన వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ ఇప్పుడు దాని గురించి కూడా ఆలోచిస్తున్నామని చెప్పడం తాజా పరిణామం. అదేవిధంగా విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు, ఈ సమావేశంలో లోతుగా చర్చ జరిపినట్లు తెలుస్తోంది. అన్నిటికంటే ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, 2026వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సీట్ల పెంచే ఆలోచన ఏదీ లేదని చెప్పిన వెంకయ్య నాయుడే ఇప్పుడు దని గురించి కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ చర్చలన్నీ ముగిసి ఒకటి రెండు వారాల్లో నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. రెండేళ్ళు ఆలస్యం అయినా చివరికి కేంద్రంలో కదలిక రావడం శుభపరిణామమే.అందుకు కెవిపికి, అరుణ్ జైట్లీకి థాంక్స్ చెప్పాలేమో!