సినిమా సినిమాకీ తన రేంజ్ పెంచుకొంటూ పోతున్నాడు నాని. భలే భలే మగాడివోయ్తో నాని ఓవర్సీస్ స్టామినా ఎంతో తెలిసిపోయింది. ఆ సినిమా విదేశాల్లో దాదాపు రూ.10 కోట్ల వరకూ సాధించింది. ఆ ఎఫెక్ట్ కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మెన్లపై పడింది. ఇవి కూడా ఓవర్సీస్లో డీసెంట్ వసూళ్లను సాధించాయి.క్రమంగా ఓవర్సీస్ ఆడియన్స్కు మరింత దగ్గరైపోతున్నాడు నాని. అందుకే నాని సినిమా వస్తోందంటే… ఓవర్సీస్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రస్తుతం మజ్నుకీ భారీ రేటు పలికింది. ఈ సినిమాని దాదాపుగా రూ.3 కోట్లకు కొనేశారక్కడ.
ఇటీవల విడుదలైన పెళ్లి చూపులు సినిమాకి అక్కడ రూ.6 కోట్ల వరకూ వచ్చింది. ఆ రేంజులో నాని సినిమా హిట్టయితే మళ్లీ రూ.10 కోట్లు సాధించడం అంత కష్టమేం కాదు. అదీ.. ఓవర్సీస్ డిస్టిబ్యూటర్ల లెక్క. పైగా విరించి వర్మ `ఉయ్యాల జంపాలా`తో ఆకట్టుకొన్నాడు. అదీ ఓవర్సీస్ వాళ్లకు నచ్చిన సినిమానే. కాబట్టి మజ్నుకి భారీ రేటు పలికిందక్కడ. ప్రస్తుతం నైజాం కోసం బేరాలు సాగుతున్నాయి. శాటిలైట్ కోసం అప్పుడు కర్చీఫ్లు వేసేసుకొన్నారు. ఈ జోరు చూస్తుంటే సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్తో బయట పడడం ఖాయం అనిపిస్తోంది. నాని సినిమానా… మజాకా!