పవన్ కళ్యాణ్ తను ఒక కులానికో మతానికో ప్రాంతానికో చెందినవ్యక్తిగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఆ విషయం చాలాసార్లు స్పష్టంగా చెప్పారు కూడా. కానీ ఆయన జన్మతః కాపు కులస్తుడు కావడంతో రాజకీయ నాయకులు, ఆ కులస్తులు పవన్ కళ్యాణ్ ని అదే దృష్టితో చూస్తుంటారు. అందుకు పవన్ కళ్యాణ్ ని తప్పు పట్టలేము. ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నా, వాటిలో పాల్గొన్నా కూడా సంచలనమే.
కనుక ప్రత్యేక హోదా గురించి పోరాటానికి సిద్దం అవుతున్న పవన్ కళ్యాణ్ పై ఏపిలో చాలా మంది నేతలు రకరకాల విమర్శలు గుప్పించారు. తెలంగాణాకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.
సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? మీకు కాపుల సమస్య పట్టదా? అని ప్రశ్నించారు. ముద్రగడ చేస్తున్న ఉద్యమాన్ని దెబ్బ తీయడానికే పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఊడిపడి ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్దం అవుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీయే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సంకల్పించిందని కానీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. కనుక ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ డిల్లీ వెళ్లి మోడీని నిలదీయాలని సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం చాలా చిత్తశుద్ధితో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ గురించి చులకనగా మాట్లాడితే సహించబోమని హనుమంత రావు పవన్ కళ్యాణ్ ని హెచ్చరించారు.
ముద్రగడ చేస్తున్న ఉద్యమంలో కాంగ్రెస్, వైకాపాలతో సహా రాష్ట్రంలో ఏ పార్టీకూడా పాల్గొనడం లేదు. అదేవిధంగా బహిరంగంగా మద్దతు ప్రకటించడం లేదు. ఆయన పోరాటంలో పాల్గొంటే ఇతర కులాలవారికి ముఖ్యంగా బీసిలకి ఆగ్రహం కలుగుతుందనే భయంతోనే ముద్రగడ ఉద్యమంలో పాల్గొనడం లేదు. మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు పాల్గొనాలి?
అయితే పవన్ కళ్యాణ్ కి ఓటు బ్యాంక్ భయాలు ఏవీ లేవు కానీ ముద్రగడ చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్నట్లయితే, తాను ఆ కులస్తులకి మాత్రమే పరిమితం అయ్యాడనే భావన ప్రజలకి కల్పించినట్లు అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన అటువంటి కులపోరాటాలకి దూరంగా ఉంటున్నట్లు చెప్పవచ్చు. అయినా పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎప్పుడు ఏ ఉద్యమం చేయాలో వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. చెప్పినా వినవలసిన అవసరం ఆయనకి లేదు. మిగిలిన రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలని ఏవిధంగా రూపొందించుకొని అమలు చేస్తుంటాయో, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కి ఆ స్వేచ్చ, స్వాతంత్ర్యం ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గురించి రాజకీయ నేతలు, మీడియా ఆయన గురించి కొంచెం అతిగా రియాక్ట్ అవుతున్నారంటే ఆయన చేసే సినిమాలపై ఏవిధంగా ప్రేక్షకులలో బారీ అంచనాలు ఏర్పడుతాయో, అదేవిధంగా ఆయన రాజకీయ ప్రవేశంపై కూడా చాలా బారీ అంచనాలు ఉన్నందునేనని చెప్పవచ్చు.