ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల చేతగానితనం గురించి ఎంత చెప్పుకన్నా తక్కువే. తిడితే కెసీఆర్లా తిట్టాలి…పడితే సీమాంధ్ర ఎంపిల్లా పడాలి అని అందరూ అనుకుంటున్న సత్యాన్ని చెప్పిన స్టార్ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా సీమాంధ్ర నాయకులందరిలాగే ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడమంటే ఎవరి పైన పోరాటం చేయాలి? ఎవరిని కార్నర్ చేయాలి? ఎవరిని విమర్శించాలి? అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్శించాలి. లేకపోతే నాదీ, మోడీది అభివృద్ధి జోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నీ చేస్తాం, కేంద్రం నుంచి కూడా అన్నీ తీసుకొస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చి…ఇప్పుడు చేతగాని మాటలు మాట్లాడుతున్న చంద్రబాబుని విమర్శించాలి. చంద్రబాబు కంటే కూడా నరేంద్రమోడీ వంచన గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకునేలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ చేసిన మోసం గురించి జాతీయ మీడియాలో కూడా పదే పదే కనిపించేలా పోరాటం చేయాలి. కానీ సీమాంధ్ర నాయకులందరూ కూడా కూడబలుక్కున్నట్టుగా ఒకేలా ప్రవర్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా మోడీని విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నారన్నది వాస్తవం. పంచెలూడదీసి కొట్టండి, చెప్పుతో కొట్టండి, రాక్షసులు, దుర్మార్గులు….అబ్బో చెప్పుకుంటూ పోతే మనవాళ్ళ తిట్లన్నీ కలిపితే ఓ పెద్ద పురాణమే అవుతుంది. కానీ ఆ తిట్లన్నింటినీ కూడా ఎప్పుడో చచ్చిన కాంగ్రెస్ పార్టీ పైన ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టేటప్పుడు చూడాలి మనవాళ్ళ నటన. పౌరుషం, ఆవేశం, ఆక్రోశం అన్నీ కూడా మూలిగే నక్కలాంటి కాంగ్రెస్ పార్టీపైన చూపిస్తున్నారు. అదే నరేంద్రమోడీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ‘నేను అనవసరంగా విమర్శలు చేయను, దేనికైనా టైం రావాలి, తిడితే ప్రత్యేకహోదా వచ్చేస్తుందా?’ లాంటి చేతకాని కబుర్లన్నీ చెప్తున్నారు. చంద్రబాబు, పవన్‌ల విషయం పక్కన పెడితే ప్రతిపక్షనాయకుడైన జగన్‌కి కూడా నరేంద్రమోడీని తిట్టడానికి మనసు రావడం లేదు. అదే చంద్రబాబును తిట్టమంటే మాత్రం రోజుల తరబడి తిడుతూనే ఉండగల సామర్ధ్యం జగన్ సొంతం.
ఫైనల్‌గా ఒక కఠోరమైన వాస్తవం ఏంటంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాల గురించే ఆలోచించే నాయకుడు ఒక్కడు కూడా లేడు. కుల ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాల కోసం అర్రులు చాచే బాపతు జనాలే అందరూ. ఇక అధికార పక్షమైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలు, ప్రతిపక్షమైన సాక్షి పత్రికవారు కూడా సేం టు సేం. ప్రత్యేక హోదా పోరాటం(?) క్రెడిట్‌ని తాము కొమ్ము కాసే నాయకుల ఖాతాలో వేయటానికి, ఒకవేళ కేంద్రం ఏమైనా ముష్టి విదిలిస్తే అది మేం సపోర్ట్ చేస్తున్న నాయకుడి ప్రతిభే అని చిడతలు వాయించడానికి శతథా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మీడియా సంస్థలు కూడా మోడీని విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నాయి. జనాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నవాళ్ళందరూ కూడా స్వార్థ ప్రయోజనాల కోసమే అహర్నిశలూ శ్రమిస్తూ ఉంటే.. సీమాంధ్ర ప్రజలు కూడా నిస్సహాయంగా ఉండిపోతున్నారు.
తెలంగాణా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణా నాయకులందరూ కూడా తెలంగాణా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని, ఇచ్చితీరాల్సిందేనని సోనియాగాందీ దగ్గర పోరు పెట్టారు. అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా పోరాట సమయంలో బిజెపిలో ఉన్న సీమాంధ్ర నాయకులందరూ కూడా బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్‌కి చాలా చేస్తోందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలాంటి దారుణాలకు ఒడిగొట్టిన పురంధేశ్వరిలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. వెంకయ్య నాయుడుతో సహా ఏ ఒక్కళ్ళు కూడా బిజెపి అధిష్టానాన్ని ఒఫ్పించే ప్రయత్నాలు చేయడం లేదన్నది వాస్తవం. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నరేంద్రమోడీని ధిక్కరించాలన్న ఆలోచన కూడా ఒక్కళ్ళకు కూడా లేదు. అందరూ కలిసి ప్రత్యేక హోదా రాకపోతే పోయేదేముంది, ఎవ్వరికీ రావడం లేదు కదా?, కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి లక్షల కోట్ల నిధులు ఇస్తూ ఉంది అని ప్రజలను నమ్మించడానికి శతథా ప్రయత్నిస్తున్నారు.
బ్రిటిష్ కాలం నుంచి అలవాటైన బానిస మనస్తత్వాన్ని మన నాయకులెవ్వరూ కూడా వదులుకున్నట్టు లేరు. జగన్ పార్టీ, చంద్రబాబు పార్టీ, నరేంద్ర మోడీ పార్టీ….పేరు ఏదైతేనేం మనవాళ్ళందరూ కూడా అధినాయకుడి అడుగులకు మడుగులొత్తే బానిసలు. వీళ్ళకు ప్రజా ప్రయోజనాలు అస్సలు అవసరం లేదు. నాయకుడి ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం బలవంతుడి దగ్గర మానసిక బానిసలుగా పడి ఉండడమే వీళ్ళ నైజం.