కోటా శ్రీనివాసరావు… విలక్షణతకు మరో పేరు ఈ నటుడు. ఏ పాత్ర ఇవ్వండి… దాని అంటూ చేసేవరకూ వదలడు. ఈ రోజు కోట ప్రత్యేకంగా తనని తానూ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఐతే.. కోట తరం ఐపోయింది. కొత్తవాళ్లు వచ్చాక తప్పుకొని వాళ్లకు దారి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కోట మాత్రమే చేయదగిన పాత్రలు కూడా పుట్టడం లేదు. హాయిగా తనకు తానె రిటైర్ మెంట్ తీసుకోవాల్సిన వయసు ఇది. కానీ ఇప్పటికీ ఆయనకు నటించాలనే వుంది. కానీ అవకాశాలు రావడం లేదు. కోట వేయాల్సిన పాత్రలు పరభాషా నటుల వశం అవుతున్నాయి. దాంతో కోట లోని ఆవేశం బద్దలవుతొంది.
ఈమధ్య కోట కొన్ని చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ప్రతీసారి పరభాషా నటులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. డబ్బులు ఎక్కువ ఇచ్చి మరి… వాళ్ళని మోయవలసిన అవసరం ఏముందన్నది కోట ప్రశ్న. ఆఖరికి జనతా గ్యారేజ్ ని కూడా వదల్లేదు. ఆ సినిమా చూసి.. మోహన్ లాల్ బాగా చేసాడని అంతా చెబుతున్నారని, ఎన్టీఆర్ లాంటి హీరో ఉండగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రని నమ్ముకుని సినిమా తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు కోట. పరభాషా నటుల తాకిడి, కొత్త తరం రాకతో కోటకు అవకాశాలు తగ్గాయి అనడం వాస్తవం. ఈ గోల ఇప్పటిది కాదు. ప్రకాష్ రాజ్ వచ్చిన కొత్తలో కూడా ఇంతే. కోటకూ – ప్రకాష్ రాజ్ కీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది కూడా. ఆ తరవాత రావూ రమేష్ వచ్చి వీరిద్దరి అవకాశాల్ని తన్నుకు పోయాడు. తెలుగు నటులకి అవకాశాలు రావడం లేదన్నది కోట బాధ కావచ్చు. అయితే తనని పట్టించుకోవడం లేదన్న బాధ కూడా కనిపిస్తోంది. తనలో ఇంకా నటించే సత్తా వున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధకు… మోహన్ లాల్ లాంటి వాళ్ళు కోట్ల కు కోట్లు పారితోషికాలు తీసుకోవడం, వాళ్ళ మీద సినిమాలు నడపడం ప్రొఫెషనల్ జలసీ అనుకోవొచ్చేమో..?