మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? డైలాగ్ కింగ్.. కలక్షన్ కింగ్. టాలీవుడ్ పెదరాయుడు. డైలాగ్ చెప్పాలంటే మోహన్ బాబు తరవాతే ఎవరైనా. దాన్నే ఆయుధంగా చేసుకొని నాలుగు దశాబ్దాల పాటు తన ప్రభావం చూపించాడు. ఇప్పటికీ మోహన్ బాబు కోసం కొత్త పాత్రలు పుడుతూనే ఉన్నాయి. అయితే.. మోహన్ బాబు ఆచితూచి స్పందిస్తున్నాడు. త్వరపడి ఏదీ ఒప్పుకోవడం లేదు. తనయుల సినిమాల్లో మాత్రం అప్పుడప్పుడూ మెరుస్తున్నాడు. అయితే మోహన్ బాబుకి వెరైటీ రోల్స్ చేయాలని చాలా ఇదిగా ఉందట. మరీ ముఖ్యంగా విలన్ పాత్రలతో మళ్లీ మెప్పించాలని ఉందట. అందుకు తగిన సన్నాహాలు కూడా చేస్తున్నాడు ఈ రాయల సీమ రామన్న చౌదరి.
వేరే వాళ్ల కథల్లో, వాళ్లు సృష్టించే పాత్రల్లో దమ్ములేదని మోహన్ బాబు భావిస్తున్నాడేమో. అందుకే తన కోసం. తన పాత్రల కోసం తనే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. అవును… మోహన్ బాబు రచయితగా అవతారం ఎత్తబోతున్నాడు. తన కోసం కథలు రాస్తున్నాడట. కొన్ని కొత్త పాత్రల్ని తానే డిజైన్ చేసుకొని.. వాటిని రైటర్ల చేతిలో పెడుతున్నాడన్నమాట. అంటే పాత్ర చుట్టూ కథని అల్లుతున్నారన్నమాట. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో కొంతమంది యువ దర్శకుల్ని చేర్పించారు. బివీఎస్ఎన్ రవిలాంటి వాళ్లు ఈ సంస్థకు ఆస్థాన రచయితలు. ప్రస్తుతం వాళ్లు మోహన్ బాబు కోసం పాత్రల్ని సృష్టిస్తున్నారు. ఇటీవలే 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకొన్నాడీ పెదరాయుడు. చూస్తుంటే మరో పదేళ్లు పొగిడించే కార్యక్రమం మొదలైనట్టే అనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్… మోహన్ బాబు.