క్రికెటర్ల జీవిత కథలను సినిమాలుగా తీయాల్సిన అవసరం లేదు. అంతకంటే కూడా సైనికుల కథలను తెరకెక్కిస్తే బాగుంటుంది…. నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని ఇండియన్ క్రికెటర్ గౌతం గంభీర్ చెప్పాడు. తనకు అవకాశాలు రాకుండా చేయడంలో విజయవంతమైన పాత్ర పోషించిన ధోనీపైన కోపంతో అన్నాడో, లేక నిజాయతీగానే తన అభిప్రాయం చెప్పాడో కానీ గంభీర్ చెప్పిన మాటలు కొంతవరకూ వాస్తవమే. ఆల్రెడీ క్రికెట్ పైన పిచ్చితో లక్షల మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బిసిసిఐలో ఉన్న పెద్దల అవినీతి బాగోతాలు, ‘రసిక’ రాజకీయాల దెబ్బకు చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా తెరమరుగైపోతున్నారు. ఇక స్పాన్సర్డ్ హీరోలుగా అనిపిస్తూ ఉండే వాళ్ళ జీవిత కథలను బిగ్ స్క్రీన్ పైకి తీసుకుని వస్తే ఇంకెంత మంది యువత క్రికెట్‌కి ‘బానిస’ ప్రేక్షకులు అవుతారో…బిసిసిఐకి, ప్లేయర్స్‌కి కోట్లాది రూపాయల సంపాదన వచ్చేలా చేయడం కోసం ఇంకెంత మంది విద్యార్థులు…తమ జీవితాలను త్యాగం చేస్తారో ఊహించడం కూడా సాధ్యం కాదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ధోనీ జీవిత కథను కేవలం ఓ సినిమా అనేలాగే తీసినవాళ్ళు చెప్పడం లేదు. చాలా గొప్పగా ఉండేలా చెప్పడానికి ఏదో ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ తన పేమెంట్ని కూడా గట్టిగానే తీసేసుకున్న ధోనీ…మరి కాస్త క్రేజ్‌ని పెంచుకోవడానికి తనవంతు ప్రయత్నం బాగానే చేస్తున్నాడు.
ధోనీ జీవిత కథ అంటేనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటే ఇప్పుడిక సన్నీలియోన్ కూడా జీవిత కథతో రెడీ అయిపోయింది. సిక్కు కుటుంబంలో పుట్టి, పోర్న్ స్టార్‌గా ఎదిగి(?), బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కథ వరకూ సన్నీ జీవితం మొత్తం తెరకు ఎక్కిస్తున్నారట. తన ప్రతిభకు క్రేజ్ తీసుకొచ్చేది, వీడియోకు పాపులారిటీ తీసుకొచ్చే విషయం సన్నీ పోర్న్ స్టార్‌గా మారిన కాలానికి సంబంధించిన ఎపిసోడ్ అని డైరెక్టర్‌కి బాగానే తెలిసి ఉంటుంది. పోర్న్ వీడియోస్‌లో నటించడానికి సన్నీ ఎంత కష్టపడింది? తన టాలెంట్(?)ని ఎలా ప్రూవ్ చేసుకుంది? ఎలా విజేత అయింది? అనే విషయాలను రొమాంటిసైజ్ చేస్తూ చుపిస్తారనడంలో సందేహం లేదు. కాసుల కక్కుర్తి, కాస్తంత పేరు వస్తుందన్న స్వార్థం విషయం పక్కన పెడితే సన్నీ ఆత్మకథను స్క్రీన్ పైకి తీసుకురావడం ఎందుకు? అన్న ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి. బుల్లితెర క్రియెటివ్ పీపుల్ అయినా, సినిమా వారయినా కాస్తంత ప్రయోజనకరంగా, జీవితంలో విజయం సాధించాలన్న స్ఫూర్తిని ఇచ్చే జీవిత కథలను తెరకెక్కిస్తే అర్థవంతంగా ఉంటుందేమో? అంటే… మళ్ళీ క్రికెట్టు, సినిమా స్టార్స్‌వి కూడా విజయాలే కదా అంటారేమో. అలాంటి విజయాల గురించి ప్రతి రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాంగా. ఆ ఒక్కటి మినహా ఇంకేం టాలెంట్ ఉందో తెలియని సన్నీలియోన్‌తో సహా సినిమా, క్రికెట్ స్టార్స్ గురించి చాలా చాలా గొప్పగా పేజీలకు పేజీలు, గంటలు గంటలు చెప్పేస్తోంది మన మీడియా. ఇంకా ఇంకా కూడా మన ఆలోచనలన్నీ కూడా సినిమా, క్రికెట్ చుట్టూనే తిరిగేలా చేసే ప్రయత్నాలు ఎందుకు?