తమిళ కథానాయకుడే అయినా తెలుగులోనూ అంతో ఇంతో ఇమేజ్ దక్కించుకొన్నాడు విశాల్. ముఖ్యంగా సీ సెంటర్లలో విశాల్‌కి మంచి మార్కెట్ ఉంది. తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు విశాల్. ఇప్పుడు అందుకు రంగం సిద్దమైంది. శ్రీవాస్ చెప్పిన కథకు విశాల్ ఓకే చెప్పినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. జనవరి నుంచి ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లనుంది. విశాల్ నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రమిదే. డిక్టేటర్ తరవాత శ్రీవాస్ డైరెక్షన్లో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. మధ్యలో గోపీచంద్‌కి ఓ కథ వినిపించి ఓకే అనిపించుకొన్నా.. ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి టైమ్ పట్టేట్టు ఉంది. అందుకే ఈలోగా విశాల్ సినిమాని ఓకే చేశాడు శ్రీవాస్. నిర్మాతగానూ శ్రీవాస్‌కి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. పార్ట్నర్షిప్ బేసిక్ మీద శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడన్నమాట. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. విశాల్‌కి తగ్గట్టుగానే యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ లవ్ స్టోరీ ఈ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయట. తెలుగులో పూర్తిగా తెలుగు నటీనటులతో, తమిళ వెర్షన్‌కి అక్కడ నటీనటులతో ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం వేట సాగుతోంది. తెలుగు, తమిళ పరిశ్రమలకు బాగా పరిచయం ఉన్న నాయికని ఎంచుకోవాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది.