మీడియా, జర్నలిజం లాంటి పెద్ద పెద్ద పదాలను వదిలేస్తే పది మందితో ఒక విషయాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు… ఎలాంటి విషయం చెప్తున్నాం? ఏం చెప్తున్నాం? చెప్పడం ధర్మమా? కాదా? అన్న కనీస స్పృహ అయినా ఉండాలి. కానీ కొంత మందికి అది కూడా లేకుండాపోతోంది. బాహుబలి సినిమా గొప్ప సినిమానా? కాదా? అనే విషయంపైన చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఆ సినిమా కోసం తపస్సు చేస్తున్నాడు రాజమౌళి. అలాగే బాహుబలి యూనిట్ అందరూ కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. భారతదేశంలో ఉన్న అన్ని భాషలలోనూ, అలాగే ప్రపంచ దేశాలకు కూడా తెలుగు సినిమాను పరిచయం చేస్తున్నాడు మన జక్కన్న. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ మార్కెట్ పరిధిని ఆకాశమంత స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఆ విషయంలో అందరూ ఆయనను అభినందించాల్సిందే. అలా అభినందించడానికి కూడా చాలా మందికి మనసు రావడం లేదు. కానీ బాహుబలి-2 సినిమాకు నష్టం చేసే ప్రయత్నాలు మాత్రం పని గట్టుకుని చేస్తున్నారేమో అనిపిస్తోంది.
బాహుబలి-2 సినిమాకు సంబంధించి ఒక్క ఫొటో కూడా లీక్ అవకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు రాజమౌళి. తన కష్టం బూడిద పాలు అవ్వకూడదన్న సంకల్పంతో పాటు, ప్రేక్షకులకు కూడా ఏమీ తెలియకుండా ఉంటేనే సినిమాను పూర్తిగా ఆస్వాదించగలరు అనేది రాజమౌళి ఆలోచన. అందులో తప్పు కూడా ఏమీ లేదు. అయితే కొంత మంది తెలుగు జర్నలిస్టులు మాత్రం ఎలా అయినా బాహుబలి సినిమా కథను దొంగతనం చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. సినిమా యూనిట్లో ఎవరికైనా లంచం ఇచ్చి చెప్పించుకున్నారో లేక కథ ఇలా ఉండబోతోందని ఊహించేసి కథనాలుగా వండివార్చారో తెలియదు కానీ బాహుబలి-2 కథ ఇది అని వరుసగా కథనాలు రాసేస్తున్నారు. లీక్డ్ స్టోరీ అని రాతలు రాయడం కూడా రెగ్యులర్‌గా జరిగే విషయమే అనుకుందాం. అయితే కొంతమంది ఇంకో మెట్టు ఎక్కేసి…కాదు కాదు దిగజారి ‘దమ్ముంటే రాజమౌళిని కండించమనండి’ అని రాతలు రాస్తున్నారు. ఆ ఛాలెంజులే చాలా మందిని బాధపెడుతున్నాయి. ఒకరి దగ్గర నుంచి ఒక వస్తువును దొంగతనం చేసి…తిరిగి వాడికి అదే వస్తువును చూపించి…నీ వస్తువును నేను దొంగతనం చేశా….దమ్ముంటే కాదని చెప్పు అని ఛాలెంజ్ చేసినట్టుగా ఉంది వ్యవహారం. ఇది నేరం కాదా? వీళ్ళకు శిక్షలు ఉండవా? పైరసీ వీడియోలు తప్పు అయినప్పుడు… అధికారికంగా కథ బయటకు రాకముందే ఆ కథను పదిమందీ చదివే పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్స్‌పై పబ్లిష్ చేయడం భావ్యమేనా? ప్రపంచానికి విలువలు నేర్పించి… పరిశుభ్రం చేయడానికి బయల్దేరాం అని డప్పు కొట్టుకునేవాళ్ళు.. తమ కాళ్ళకు ఉన్న బురద గురించి కూడా కాస్త ఆలోచించుకుంటే బాగుంటుందేమో.
లీక్ అయిన కథ బాహుబలి-2 కథ అవునో కాదో తెలియదు కానీ…ఆ కథను పబ్లిష్ చేసి.. దమ్ముంటే రాజమౌళిని కండించమనండి అని రాయడం మాత్రం క్షమించరాని నేరం. అందరూ కండించాల్సిన విషయం.