సరైన థియేటర్లు, కావల్సిన సంఖ్యలో అందుబాటులో లేకపోవడం వల్లో, లేదంటే ఒకేసారి ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి, ఎక్కువ వసూళ్లు దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతుండడంతోనో… ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రావడం అరుదైపోయింది. అగ్ర హీరోల సినిమాల మధ్య రెండు వారాల కనీస విరామం ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. ఆఖరికి మీడియం రేంజున్న సినిమాలూ ఇదే సూత్రం పాటిస్తున్నాయి. అందుకే థియేటర్ల దగ్గర గుంపుగా సినిమాలు రావడం అరుదైపోయింది. ఈ దసరాకి మాత్రం ఆ సరదా తీరబోతోంది. ఈ పండక్కి ఏకంగా 5 సినిమాలు వచ్చేస్తున్నాయి. 6వ తారీఖున జాగ్వార్ విడుదలైతే, మరుసటి రోజు ప్రేమమ్, అభినేత్రి, మన ఊరి రామాయణం, ఈడు గోల్డ్ ఎహే చిత్రాలు వరుస కడుతున్నాయి. ఒకే వారం 5 సినిమాలంటే పండగే.. పండగ. మరి వీటిల్లో లాభం పొందే సినిమా ఏదీ? పోటీలో నలిగిపోయేదేది??
గురువారం వస్తున్న జాగ్వార్‌తో దసరా హంగామా మొదలవుతోంది. గురువారం సోలో రిలీజ్ కాబట్టి జాగ్వార్‌కి పోటీ లేనట్టే. అయితే జాగ్వార్ ఆ ఒక్కరోజు దండుకొంటే సరిపోదు. ఎందుకంటే దాదాపు రూ.70 కోట్లతో తెరకెక్కిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి జగపతిబాబు, రమ్యకృష్ణలాంటి నటీనటుల్ని తీసుకొచ్చారు. తమన్నాతో ఓ ఐటెమ్ పాట చేయించారు. థియేటర్లు ఎక్కువ మొత్తంలో చేజిక్కించుకొని తనయుడిని కావల్సినంత భారీ రిలీజ్ ఇవ్వాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పెద్ద స్కెచ్చే వేశాడు. అయితే శుక్రవారం నుంచీ తెలుగు చిత్రాల జోరు ఎక్కువవుతుంది. వాటి మధ్య జాగ్వార్ నిలవాలంటే.. సినిమాలో సత్తా ఉండాల్సిందే. లేదంటే రెండో రోజే జాగ్వార్ జారు కోవడం ఖాయం.
శుక్రవారం విడుదల అవుతున్న చిత్రాల్లో కచ్చితంగా మొదటి ఛాయిస్…ప్రేమమ్కే. మలయాళంలో ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ ఇలా స్టార్లకు కొదవలేని చిత్రమిది. ప్రేమమ్ టార్గెట్ ఆడియన్స్ యూత్. వాళ్లకు ఈ సినిమా ఎక్కితే చాలు. ఇక మాస్‌ని లాక్కోవడానికి ఈడు లోల్డ్ ఎహెతో సునీల్ సిద్దంగా ఉన్నాడు. ప్రేమమ్ తరవాత రెండో ఆప్షన్ ఈ సినిమాకి ఇవ్వొచ్చు. కాకపోతే సునీల్ ఫామ్‌లో లేకపోవడం, ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ కాకపోవడం పెద్ద మైనస్. ఇక అభినేత్రి లో కూడా ఆకర్షించే అంశాలు చాలా ఉన్నాయి. తమన్నా డాన్సుల కోసమైనా ఈ సినిమా చూడాల్సిందే అన్నట్టుగా టీజర్‌ని కట్ చేశారు. వీటి మధ్య కచ్చితంగా నలిగిపోయే సినిమా ఏదైనా ఉందీ అంటే… అది మన ఊరి రామాయణం సినిమానే. ప్రకాష్‌రాజ్ దర్శకత్వం నుంచి వస్తున్న మరో సినిమా ఇది. దర్శకుడిగా తనదైన మార్క్ చూపించడంలో ప్రకాష్ రాజ్ విఫలం అయ్యాడు. ఉలవచారు బిరియానీ ఏమాత్రం రుచీ పచీ లేకుండా తీయడం.. ఈ సినిమాపై ప్రభావం చూపించనుంది. సినిమా ఎంత బాగున్నా… బీసీల్లో ఆదరణ కరువయి, ఈ సినిమా ఏ సెంటర్లకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి.
అయితే వరుసగా సెలవలు రావడం, బరిలో స్టార్ హీరో సినిమా లేకపోవడం ఈ 5 సినిమాలకు కంబైన్డ్‌గా కలిసొచ్చే విషయం. ప్రారంభ వసూళ్లు అటూ ఇటూగా ఉన్నా, సినిమాలో విషయం ఉందని తెలిస్తే.. మాత్రం దసరా బరిలో నిలిచిందుకు తగిన ప్రతిఫలం దక్కడం ఖాయం.