తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే మెడలు ఒంచి స్వారీ చేస్తాడు. అందుకే నేషనల్ అవార్డులూ దక్కాయి. అయితే మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రావడం అనే పాత్ర బోర్ కొట్టినప్పుడల్లా నిర్మాతగా, దర్శకుడిగా తన వంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. అక్కడ మాత్రం తనదైన అభిరుచిని చాటుకొనే ప్రయత్నం చేస్తుంటాడు. అందులో భాగంగా వచ్చిన చిత్రాలే ఆకాశమంత, గగనం, ధోనీ, ఉలవచారు బిరియానీ. ఆయా సినిమాలు ప్రకాష్ రాజ్‌లోని నిర్మాతనో, దర్శకుడ్నో ఎంత ఎలివేట్ చేశాయో తెలీదు గానీ… అభిరుచి మాత్రం స్పష్టంగా బయటపడింది. మరోసారి అతనిలోని దర్శకుడు మేల్కొని చేసిన ప్రయత్నం… మన ఊరి రామాయణం. ఈసారి ప్రకాష్ రాజ్ ఎలాంటి సినిమా తీశాడు? ఈ సినిమా కథేంటి? దర్శకుడిగా ప్రకాష్ రాజ్ వేసిన ముద్రేంటి?
కథ
భుజంగం (ప్రకాష్‌రాజ్) దుబాయ్‌లో బాగా సంపాదించి సొంతూర్లో స్థిరపడ్డాడు. ఆ ఊరికి సంబంధించినంత వరకూ పెద్ద మనిషే. ఇంట్లో కూడా ఆ పెద్దరికం నిలబెట్టుకోవాలని భార్యనీ, కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోవాలని వాళ్లపై ఆధిపత్యం చూపిస్తుంటాడు. కూతురికి ఇష్టం లేకపోయినా ఓ సంబంధం తీసుకొస్తాడు. ఓరోజు రాత్రి తాగిన మైకంలో.. ఓ వేశ్య (ప్రియమణి)తో బేరమాడి తన ఇంటి ముందరే ఉన్న ఓ షాపులోనికి తీసుస్తాడు. ఈ విషయంలో భుజంగానికి శివ (సత్య) అనే ఆటో డ్రైవరు సహాయం చేస్తాడు. తనేమో భుజంగం దగ్గర వీసా తీసుకొని దుబాయ్ వెళ్లిపోవాలన్న ఆశతో తనకు సపర్యలు చేస్తుంటాడు. వేశ్యని ఏదో మోజులో షాపులోకి తీసుకొస్తాడు గానీ… మనసులో భయం, అనుమానం రెండూ మొదలవుతాయి. ఈ సంగతి ఊర్లో తెలిస్తే తన పరువేం కావాలి? తన కూతురు భవిష్యత్తేంటి? ఇవన్నీ ఆ సమయంలో గుర్తొస్తాయి. అంతే.. వేశ్యని పంపించేయాలనుకొంటాడు. కానీ… అనుకోకుండా ఆ గదిలో రెండు రోజుల పాటు ఇరుక్కుపోవాల్సివస్తోంది. అప్పుడు భుజంగం ఏం చేశాడు? ఆ గదిలోంచి ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ చిత్ర కథ.
పెర్‌ఫార్మ్సెన్స్
నాలుగు పాత్రల చుట్టూ నడిచే కథ ఇది. ప్రియమణి, ప్రకాష్‌రాజ్, సత్య, ఫృథ్వీ… చూట్టూ సినిమా నడుస్తుంది. నలుగురివీ విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్నమైన మనస్తత్వాలు. ఆయా పాత్రల్లో ఈ నలుగురూ చూడచక్కగా రాణించారు. అందరి కంటే ఎక్కువ మార్కులు ప్రియమణికే దక్కుతాయి. వేశ్య పాత్రలో `సంసారపక్షం`గా నటించేసింది. ఆమె చూపులు, మాటలు ఆకట్టుకొంటాయి. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన పద్దతి బాగుంది. ప్రియమణి కూడా అందంగా కనిపించింది. ఇక ప్రకాష్‌రాజ్ తొలి సన్నివేశాల్లో ఓవరాక్షన్ చేశాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాతర్వాత తనలోని నటుడ్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఫృద్వీని ఈ తరహా పాత్రలో ఇంతకు ముందు చూసుండం. లౌడ్ కామెడీ చేసి నవ్వించే ఫృద్వీ.. సెటిల్డ్ గా సెటైర్లు వేయడం కొత్తగా అనిపిస్తుంది. ఆటో ట్రైవర్గా సత్య కూడా తన పరిధి మేరకు రాణించాడు.. పాత్ర పండించాడు.
టెక్నికల్ టీమ్
మలయాళంలో మంచి విజయం సాధించిన షట్టర్ సినిమాకి ఇది రీమేక్. మాతృకలోని లైన్‌ని పట్టుకొని ప్రకాష్ రాజ్‌లోని దర్శకుడు ప్రయాణం చేశాడు. ఎక్కువ మార్పులూ, చేర్పులకూ దిగలేదు. దర్శకుడిగా గత సినిమాలకంటే మన ఊరి రామాయణంతో మంచి అవుట్ పుట్ వచ్చిందనుకోవాలి. ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. ఇళయరాజా ఈ స్థాయిలో నేపథ్య సంగీతం అందించి చాలా కాలం అయ్యింది. ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. అదే టైటిల్ సాంగ్. దాన్ని ఎండ్ టైటిల్స్‌లో వాడారు. ఈపాటని బిట్లు బిట్లుగా మధ్య మధ్యలో వాడుకొంటే బాగుండేది. కెమెరా పనితనం ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలో దాదాపు సగం ఒకే గదిలో జరుగుతుంది. అది కళాదర్శకుడు వేసిన సెట్ అనే విషయం ఎవరో చెబితే గానీ మనకు తెలీదు. సంభాషణల్లో మెరుపు తక్కువ.
విశ్లేషణ
ఒకే మనిషిలో రాముడూ ఉంటాడు, రావణుడూ ఉంటాడు. బలం తెలియని హనుమంతుడూ ఉంటాడు. శూర్పణకలా కనిపించే అమ్మాయి… అప్పుడప్పుడూ సీతంత గొప్పగా కనిపించొచ్చు. పరిస్థితులే మనుషుల్ని మారుస్తాయి.. ఏమారుస్తాయి. ఈ విషయమే చెప్పాలనుకొన్నాడు కథకుడు. తాత్కాలిక ఆకర్షణలకు లోనై ఓ తప్పు చేద్దామనుకొన్న వ్యక్తి.. ఆ తరవాత తాను చేస్తోంది తప్పు అని తెలుసుకొన్న క్షణం ఎంత కృంగిపోతాడు, అందులోంచి బయటకు రావడానికి ఎంత మధన పడతాడు? అనే పాయింట్ తో డీల్ చేసిన సినిమా ఇది. ఇలాంటి పాయింట్లతోనూ సినిమా చేయొచ్చా? అనిపిస్తుంది. పాత్రల్ని పరిచయం చేసుకొంటూ… కథలోకి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. ప్రియమణి పాత్ర ఎప్పుడైతే కనిపించిందో.. అప్పుడు కిక్ వస్తుంది. అక్కడ్నుంచి విశ్రాంతి వరకూ.. సినిమా పరుగెడుతుంది. ద్వితీయార్థం కాస్త నెమ్మదిగా సాగినా… పతాక సన్నివేశాల్లో ఎమోషన్ కంటెంట్ పండించడానికి దర్శకుడు వేసుకొన్న ఫ్లాట్ ఫారమ్ అనేది గమనించుకోవాలి. ఫృద్వీ పాత్ర రాసుకొన్న విధానం నచ్చుతుంది. కథలో భాగంగా ఉండే కీలకమైన పాత్ర అది. తను మాత్రం చాలా సీరియస్‌గా ఉంటాడు. కానీ.. అతన్నుంచి కావల్సినంత వినోదం పండుతుంది. సెకండాఫ్‌లో ఊరటనిచ్చే విషయాల్లో ఫృద్వీ క్యారెక్టర్ ఒకటి. అయితే పతాక సన్నివేశాల్లో దర్శకుడు అనుకొనే ట్విస్టు, పండించాలనుకొన్న ఎమోషన్ సరిగా క్యారీ అవ్వలేదు. ఓ వేశ్య తాను కష్టపడి, తన శరీరాన్ని కష్టపెట్టుకొని డబ్బులు ఎందుకు సంపాదించింది? ఎవరి కోసం? ఎందుకు అనే విషయాల్లో దర్శకుడు క్లారిటీ ఇవ్వలేకపోయాడు. ప్రియమణికీ – ప్రకాష్‌రాజ్‌కీ రూమ్‌లో జరిగిన సంభాషణల్లో ఒక్క హార్ట్ టచ్చింగ్ సీన్ కూడా లేదు. ఈ రెండు విషయాలపై దర్శకుడు దృష్టి పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది. సినిమా కూడా సడన్‌గా ముగించేసినట్టు అనిపిస్తుంది.బీసీ ఆడియన్స్‌కి కావల్సిన సరుకు ఈసినిమాలో అంతంత మాత్రంగానే ఉంది. ఏ క్లాస్ ఆడియన్స్చూద్దామంటే వేశ్య కథ అయిపోయింది. కాకపోతే.. దర్శకుడిగా ప్రకాష్ రాజ్ కాస్త ఎదిగాడు. తాను అనుకొన్నది తెరపై చూపించగలిగాడు.