నాగభరణం సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకొచ్చిన శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ… బాహుబలి సినిమా గురించి చాలా మాట్లాడేశాడు. సినిమా కోసం గ్రాఫిక్స్ ఉండాలి కానీ గ్రాఫిక్స్ కోసమే సినిమా ఉండకూడదని మా గొప్ప సూత్రం చెప్పాడు. ఓవరాల్‌గా బాహుబలి సినిమాలో చెప్పుకోదగ్గ కథ లేదని, గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయనే అర్థం వచ్చేలా మాట్లాడేశాడు. నాగభరణం సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ చూసినప్పుడే ఒక అభిప్రాయం తెచ్చుకుని జాగ్రత్తపడిన ప్రేక్షకుల విషయం పక్కన పెడితే…అరుంధతి లాంటి సినిమాలు చూసి కోడి రామకృష్ణ పైన అంచనాలు పెంచుకున్నవాళ్ళు మాత్రం, బాహుబలి సినిమాలో ఉన్న రేంజ్ గ్రాఫిక్స్‌తో పాటు మంచి కథ కూడా ఈ నాగభరణంలో ఉందేమో అని భ్రమపడ్డారు. ఆ రకంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం బాహుబలి గురించి కోడిరామకృష్ణ మాట్లాడిన మాటలు ప్లస్సే అయ్యాయి. మొదటి షో స్టార్ట్ అయ్యే టైంకి థియేటర్లో దాదాపుగా వందమంది ప్రేక్షకులు ఉన్నారు. అత్యంత ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే సినిమా చివరి రీల్‌కి వచ్చేసరికి ఇంకా పాతికమంది ప్రేక్షకుల వరకూ థియేటర్లోనే కూర్చుని ఉన్నారు. కోడి రామకృష్ణగారి ఖళాఖండం ప్రేక్షకులను ఆ రేంజ్లో భయపెట్టినప్పటికీ…. 150 రూపాయలు ఇచ్చాం కదా అన్న మొండి పట్టుదలతోనో, లేకపోతే ఎసి కోసం ఉన్నారో తెలియదు కానీ ఓ పది శాతం మంది ప్రేక్షకులు మాత్రం చివరి వరకూ సినిమాని భరించారు.
కథ గురించి బోలెడన్ని మాటలు చెప్పిన కోడి రామకృష్ణ చేసిందేంటంటే అప్పుడెప్పుడో తనే తీసిన అంజి, అరుంథతిలతో పాటు రుద్రమదేవి, అఖిల్…ఇంకా పాత కాలం నాటి…అంటే 80, 90ల కాలం నాటి అనుకునేరు…బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాలను కాపీ కొట్టే పడేశాడు. కథతో పాటు సీన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఎత్తేశాడు. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు జడుసుకుని చచ్చిపోయేలాగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని భయంకరంగా కంపోజ్ చేయించుకున్నాడు. అత్యంత దురదృష్ట కరమైన విషయం ఏంటంటే బాహుబలి సినిమాని అంతలా కామెంట్ చేసిన కోడివారు….. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన బాహుబలి టీజర్లో ఉన్న మ్యూజిక్‌ని కాపీ కొట్టేశాడు. ఇంతకంటే అన్యాయం ఇంకెక్కడన్నా ఉంటుందా? అది కూడా చనిపోయిన నటుడ్ని తెరపైన పునఃసృష్టి చేశానని చెప్పుకున్న కోడి రామకృష్ణ….ఆ సీన్స్‌లో మాత్రం ఎంచక్కా బాహుబలి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా వాడేసుకున్నాడు. మళ్ళీ ఈయనగారే బాహుబలి సినిమాపైన బోలెడన్ని కామెంట్స్ చేస్తూ ఉంటాడు.