ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ… ఉందో లేదో అనే అచేతన స్థితిలో ఉంది! రాష్ట్ర విభజన దెబ్బకి ఇంకా తేరుకోలేదు. ఉనికి కోసం ప్రజా పోరాటాలు నెత్తినేసుకుని అప్పుడప్పుడూ ఉద్యమిస్తున్నా… ప్రజాదరణ ఉండటం లేదు. దీంతో భవిష్యత్తులో ఏపీ కాంగ్రెస్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఆ పార్టీలో మేథోమధనం జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ అధికార ప్రతినిధులకు రెండు రోజుల శిక్షణ తరగతుల్ని ప్రారంభించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలోని తెలుగుదేశం, కేంద్రంలోని భాజపాలు కుట్ర చేశాయని ఆరోపించారు. ప్రజలను అణచివేస్తూ తెలుగుదేశం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఈ ధోరణిని పార్టీ ప్రతినిధులు సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పాలక పక్షం నేరవేర్చడం లేదనీ, ప్రజల దృష్టిని వాటి వైపు నుంచి మళ్లిస్తూ కొత్త కొత్త అబద్ధాలను ప్రచారంలోకి తెస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా విషయంపై కూడా రఘువీరా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి ఒక ఆసక్తికరమైన కారణాన్ని ఆయన తెరమీదికి తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్‌కు దక్కుతుందన్న దురాలోచనతోనే టీడీపీ భాజపాలు దాన్ని అమలు చేయలేదని ఓ కొత్త కారణం చెప్పారు. రఘువీరా ఇంటెన్షన్ ఏంటంటే… ఈ పాయింట్‌ను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తే కాంగ్రెస్‌కు మంచి మార్కులు పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో… ప్రత్యేక హోదా ఇస్తామని నాటి కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది. తరువాత అధికారంలోకి వచ్చిన భాజపా సర్కారు కూడా హోదా ఇస్తాం, ఇదిగో అదిగో అంటూ రెండున్నరేళ్ల కాలహరణం చేసి, ప్యాకేజీ ప్రకటించేసింది.
అయితే, ఈ అంశాన్ని ఏపీలో కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో రఘువీరా ఉన్నారని అర్థమౌతోంది. ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే… కాబట్టి, ఆ బిల్లుపై స్పందించి హోదా ఇస్తే, ఆ క్రెడిట్ తమకు దక్కదనే ఆలోచనతోనే కేంద్రం ఏపీకి హోదా ఇవ్వలేదన్నదని కాంగ్రెస్ నయా విశ్లేషణ. అయితే, ఈ కొత్త కారణం కాంగ్రెస్‌కు ఏమేరకు లాభిస్తుందన్నది కాలమే తేల్చాలి. నిజానికి, రాజ్యసభలో ఎంపీ కేవీపీ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏపీలో ఆ పార్టీకి మంచి మార్కులే పడ్డాయి. ఎందుకంటే, ప్రత్యేక హోదా ప్రజల హక్కు అని చెప్పిన ముఖ్యమంత్రి, ఆ తరువాత దాని గురించి మాట్లాడటం మానేశారు. పోరాడుతున్నాం అని ప్రతిపక్షం వైకాపా చెబుతున్నా అదీ నామ్‌కే వాస్తే అన్నట్టుగా ఉంది. ఆ తరుణంలో, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఏపీలో సానుకూల చర్చే జరిగింది.
దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కాస్త ఊపు వచ్చిందని అనుకున్నారు. కానీ, ఆ బిల్లుపై పురిట్లోనే సంధికొట్టేసింది! ఈలోగా కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంతో ఏపీ కాంగ్రెస్ మౌనంగా నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంశాన్ని ఇలా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రఘువీరా. మరి, రఘువీరా చెబుతున్న లాజిక్ ప్రజలు అర్థం చేసుకుంటారా అనేది ప్రశ్న.