నంబర్ ఒన్ హీరో, టాప్ ఛెయిర్ లాంటి వాటిపైన మాకు నమ్మకం లేదని సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అందరూ మాటలు చెప్పేస్తూ ఉంటారు. కానీ ఆ పొజిషన్స్ కోసం మాత్రం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తూ ఉంటారు. నా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పుకోవడంలో నాకు ఆనందం ఏమీ ఉండదు అని చెప్తూనే ఆ స్థాయిలో సినిమా కలెక్షన్స్ ఉన్నాయని గర్వంగా చెప్పుకోవడంలో మన సినిమా స్టార్స్ సిద్ధహస్తులు. రెమ్యూనరేషన్స్, బడ్జెట్, ప్రి రిలీజ్ బిజినెస్, కలెక్షన్స్…ఇలా ప్రతి విషయంలోనూ ఈ నంబర్ గేమ్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు థియేటర్స్ సంఖ్య కూడా ఉండేది. కానీ ఇప్పుడది కనుమరుగైపోయి కొత్తగా యూట్యూబ్ హిట్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ లెక్కలోకి వచ్చాయి.
మేజర్ చంద్రకాంత్ సినిమాలో యాక్ట్ చేయడానికి ఎంత రెమ్యూనరేషన్ ఇమ్మంటారు? అని మోహన్‌బాబు అడిగినప్పుడు ఎన్టీఆర్ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న. ప్రస్తుతం ఇండస్ట్రీలో నంబర్ ఒన్ ఎవరు? ఆయన ఎంత తీసుకుంటున్నారు? అనే. నంబర్ ఒన్ హీరో చిరంజీవి. ఆయన కోటి రూపాయలు తీసుకుంటున్నారు అని మోహన్‌బాబు చెప్పగానే….మరోమాటకు అవకాశం లేకుండా కోటి ఒక్క రూపాయల రెమ్యూనరేషన్ ఇమ్మని ఎన్టీఆర్ అడిగేశారు. పొలిటికల్ పార్టీ పెట్టడంతో సహా చాలా విషయాల్లో ఎన్టీఆర్‌తో కంపేర్ చేసుకునే చిరంజీవి కూడా ఇప్పుడు కంబ్యాక్ సినిమా విషయంలో అలానే ఆలోచిస్తున్నట్టున్నారు. సొంత నిర్మాణ సంస్థే కాబట్టి రెమ్యూనరేషన్ డీటెయిల్స్ ఎంత చెప్పుకున్నా సమస్య లేదు. అలాగే డిస్ర్టిబ్యూషన్ రైట్స్ కూడా సొంత వాళ్ళకే ఇస్తూ, లేకపోతే ఇచ్చేస్తున్నామని చెప్తూ చాలా ఏరియాల్లో బాహుబలి కంటే ఎక్కువ రేట్లకు అమ్ముడుపోతోంది అన్న ఫీలర్స్ని అధికారికంగానే వదులుతున్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే బోలెడన్ని జోకులు పేలుతున్నాయి. గతంలో స్టార్స్‌కి, స్టార్ ఢంకి బీభత్సమైన ఇంపార్టెన్స్ ఉండేది కానీ ఇప్పుడంతా కంటెంట్‌దే రాజ్యం. కరెక్ట్ సినిమా పడితే నాని, నితిన్‌లాంటి వాళ్ళు కూడా యాభై కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టేసేలా ఉన్నారు. తేడా వస్తే పవర్ స్టార్, సూపర్ స్టార్ సినిమాలు కూడా మొదటి రోజు సాయంత్రానికే థియేటర్స్ నుంచి లేచిపోతున్నాయి.
అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బాహుబలి సినిమాతో పోల్చుకోవడం అవసరమా? అది కూడా ఇప్పుడు సరి కొత్త రికార్డ్స్ సెట్ చేస్తున్న బాహుబలి-2 సినిమాతో కనీసం పోల్చుకునే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు బాహుబలితో మాత్రం పోలిక ఎందుకు? మామూలుగానే రిజల్ట్ తేడా వచ్చిందంటే సోషల్ మీడియా జీవులు, విమర్శకులు రచ్చ రచ్చ చేయడం ఖాయం. ఇక ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో, థియేటర్స్ రిలీజ్ లెక్కల విషయంలో బాహుబలితో పోల్చుకుంటూ ప్రచారం జరిగితే మాత్రం…రిజల్ట్ ఏ మాత్రం తేడా వచ్చినా రిలీజ్ తర్వాత ఉతుకుడు కార్యక్రమం మామూలుగా ఉండదేమో. అసలే సోషల్ మీడియా తిట్లన్నీ కూడా స్టార్స్ నట్టింట్లోకి వచ్చేస్తున్న పరిస్థితుల్లో మనఃశాంతిని పోగొట్టుకునే ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు?. రిలీజ్ తర్వాత ఏంటి? అని కూడా ఆలోచించుకుని చిరంజీవి మాటలు ఉండే స్టైల్లోనే ఆచితూచి, అన్ని జాగ్రత్తలూ తీసుకుని సినిమాని అద్భుతంగా రూపొందించి థియేటర్స్‌లో రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉంటే బెటర్. రికార్డుల గోల ఏమైనా ఉంటే ఆ తర్వాత చూసుకోవచ్చు.